మళ్లీ ప్రపంచ మార్కెట్లు క్రాష్‌..!

World markets crash again Due to corona virus - Sakshi

కరోనా కాటు తీవ్రంగా ఉంటుందన్న తాజా గణాంకాల ప్రభావం

టోక్యో/న్యూయార్క్‌: కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల వృద్ధికి తీవ్రంగానే విఘాతం కలిగిందన్న తాజా గణాంకాల కారణంగా ఆస్ట్రేలియా, జపాన్, బ్రిటన్, అమెరికా మార్కెట్లు శుక్రవారం పతనమయ్యాయి. కార్మికుల దినోత్సవం సందర్భంగా చాలా మార్కెట్లలో ట్రేడింగ్‌ జరగలేదు.  మహారాష్ట్ర  ఆవిర్భావ దినోత్సవం కారణంగా మన మార్కెట్‌కు సెలవు కావడంతో భారీ పతనం తప్పిందని నిపుణులంటున్నారు.

పతనం ఎందుకంటే...: ఆస్ట్రేలియాలో తయారీ రంగం 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అంతేకాకుండా కరోనా వైరస్‌ మూలం ఎక్కడో విచారణ చేయాలన్న అంశంపై ఆస్ట్రేలియా, చైనాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆస్ట్రేలియా నుంచి దిగుమతులపై ఆంక్షలు వి«ధించడం వంటి చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది. మరోవైపు నిరుద్యోగ భృతి కోసం అమెరికాలో దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య భారీగా పెరిగింది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఆరు వారాల్లో మూడు కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చిలో అమెరికాలో వినియోగదారుల వ్యయం రికార్డ్‌ స్థాయికి పడిపోయింది. కాగా యూరోజోన్‌ వృద్ధి ఈ క్యూ1లో 3.8 శాతం తగ్గింది. ఈ గణాంకాలు మొదలైనప్పటి (1995) నుంచి చూస్తే, ఇదే అత్యంత అధ్వాన క్షీణత.  

ఆస్ట్రేలియా స్టాక్‌ సూచీ 5 శాతం పడిపోగా,   జపాన్‌ నికాయ్‌ 3 శాతం నష్టపోయింది.  బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌సీ 2 శాతం మేర క్షీణించింది. రాత్రి గం.11.30 ని.సమయానికి అమెరికా స్టాక్‌ సూచీలు 3–4 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.   
మన నిఫ్టీకి ప్రతిరూపమైన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పగటి పూట ట్రేడింగ్‌లో 5 శాతం మేర నష్టపోయి, 9,300 పాయింట్ల దరిదాపుల్లోకి వచ్చింది. గురువారం నిఫ్టీ 306 పాయింట్లు లాభపడి 9,860 పాయింట్ల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం మన  మార్కెట్లో ట్రేడింగ్‌ జరిగిఉంటే, సెన్సెక్స్‌ 1,000 పాయింట్లు,  నిఫ్టీ 400 పాయింట్ల మేర నష్టపోయి ఉండేవని నిపుణులంటున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top