కేంద్రం హెచ్చరికలు : వాట్సాప్‌ కొత్త ఫీచర్‌

WhatsApp New Feature Will Warn You Of Dangerous Links - Sakshi

సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ విపరీతంగా పెరిగిపోతుండటంతో, ఇటీవలే ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌కు కేంద్రం గట్టి హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికల నేపథ్యంలో వాట్సాప్‌ తక్షణ చర్యలను ప్రారంభించింది. హానికరమైన మెసేజ్‌ల నుంచి యూజర్లను కాపాడేందుకు, ఫేక్‌ న్యూస్‌ నివారించేందుకు వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. గాడ్జెట్‌నౌ రిపోర్టు ప్రకారం.. వాట్సాప్‌ 2.18.204 బీటా వెర్షన్‌లో కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ ప్రవేశపెట్టిందని తెలిసింది. ‘అనుమానిత లింక్‌’  అనే ఈ ఫీచర్‌ ద్వారా.. గ్రూప్‌ల్లో ఫార్వర్డ్‌ అయ్యే ఫేక్‌ న్యూస్‌పై యూజర్లను హెచ్చరిస్తుందని రిపోర్టు పేర్కొంది. యూజర్లు ఆ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేసినప్పుడు, వాట్సాప్‌లో వచ్చే ఆ వెబ్‌సైట్‌ లింక్‌ ప్రామాణికతను పరీక్షిస్తుందని తెలిపింది. ఆటోమేటిక్‌గా మెసేజ్‌లో ఫార్వర్డ్‌ అయిన అనుమానిత లింక్‌లను చెక్‌ చేసి, యూజర్లకు హెచ్చరికలు జారీచేస్తుందని పేర్కొంది. 

ఈ పీచర్‌తో పాటు ఫేక్‌ న్యూస్‌ విస్తరించకుండా ఉండేందుకు వాట్సాప్‌ ఇతర చర్యలను కూడా తీసుకుంటుంది. షేర్‌ అయిన మెసేజ్‌ టైప్‌ చేసిందా? ఫార్వర్డ్‌చేసిందా? అనే విషయాన్ని కూడా ఈ ఇన్‌స్టాంట్‌ మెసెంజర్‌ చెబుతోంది. ఆ మెసేజ్‌లను పంపించకుండా ఉండేందుకు గ్రూప్‌ అడ్మిన్లు యూజర్లపై వేటు కూడా వేయొచ్చు. కేవలం గ్రూప్‌ అడ్మిన్‌కు మాత్రమే మెసేజ్‌లు పోస్ట్‌ చేసే అధికారం ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. ఈ ఆప్షన్ సాయంతో తప్పుడు వార్తల వ్యాప్తిని నిరోధిస్తామని వాట్సాప్‌ తెలిపింది. కాగ, ఇటీవలే ఫేక్‌ న్యూస్‌ రీసెర్చ్‌ కోసం ఒక్కో పరిశోధన ప్రతిపాదనకు రూ.34 లక్షల వరకు బహుమానం కూడా ప్రకటించింది. దీని కోసం పీహెచ్‌డీ పొందిన రీసెర్చర్లను కూడా వాట్సాప్‌ ఆహ్వానిస్తోంది. కొన్ని కేసుల్లో పీహెచ్‌డీ లేకపోయినా.. టెక్నాలాజికల్‌ రీసెర్చ్‌ వారి నుంచి  కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 
  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top