ఎంఎస్‌వోలకు షాక్: వినియోగదారులకు ఊరట

టీవీ చానెల్స్ వీక్షణం ఇకపై మరింత చౌక
నిబంధనలు సవరించిన ట్రాయ్
తక్కువ ఫీజు,ఎక్కువ ఛానెళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: చార్జీల మోతతో ఇబ్బందులు పడుతున్న కేబుల్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో కేబుల్ బిల్లులు తగ్గనున్నాయి. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కస్టమర్ల ప్రయోజనాలు కాపాడే దిశగా ట్రాయ్ కేబుల్, బ్రాడ్‌కాస్టింగ్ నిబంధనలకు కొత్త సవరణలు చేసింది. దీనికి సంబంధించి ఎంఎస్‌వోలకు ట్రాయ్ కొత్త గైడ్‌లైన్స్‌ను కూడా విడుదల చేసింది. తద్వారా కేబుల్ టీవీ ఆపరేటర్లకు భారీ షాకిచ్చింది. బ్రాడ్కాస్టర్లు విధించే చానల్ గరిష్ఠ ధరను రూ.19 నుంచి రూ. 12కు తగ్గించింది. అలాగే నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు(ఎన్‌సీఎఫ్)ను రూ.130 గా నిర్ణయించియింది. ఈ నిబంధనలు మార్చి1 నుంచి అమల్లోకి వస్తాయి. అంతేకాదు ఈ కొత్త నిబంధనలను ఈ నెలాఖరు (జనవరి) నాటికి వెబ్‌సైట్‌లో ఉంచాలని కూడా ఎంఎస్‌వోలను ఆదేశించింది.
తాజా సవరణలో భాగంగా అన్ని ఫ్రీ చానెళ్లకు వసూలు చేసే ఫీజును ట్రాయ్ రూ. 140కి పరిమితం చేసింది. ఒక ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ టీవీలుంటే వాటికి ఎన్‌సీఎఫ్‌లో 40 శాతం చొప్పున అదనంగా వసూలు చేసుకోవచ్చని తెలిపింది. దీన్ని 200 చానెళ్లకు రూ. 130గా సవరించింది. అంతేకాదు.. 200కు మించి ఎన్ని ఫ్రీ ఛానల్స్‌కి అయినా.. రూ.160కి మించి చెల్లించనక్కర్లేదని స్పష్టం చేసింది. సమాచార మంత్రిత్వ శాఖ తప్పనిసరిగా ప్రసారం చేయాలని నిర్ధారించిన ఛానెళ్లను ఎన్‌సీఎఫ్‌లో చానెళ్ల కింద లెక్కించకూడదని తెలిపింది. డీడీ ఛానల్స్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. 26 డిడి చానల్స్ టారీఫ్‌లో కాకుండా అదనమని ట్రాయ్ పేర్కొంది. ఆరునెలలకు అంతకుమించిన దీర్ఘకాలిక సబ్‌స్క్రిప్షన్స్‌కు డీపీఓలు డిస్కౌంట్లు ఆఫర్ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. డీపీఓలు వసూలు చేసే ఫీజుపై నెలకు రూ. 4 లక్షల పరిమితి విధించింది. దీంతో పాటు ఆల్‌కార్ట్ చానెల్లు, ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్, చానెల్ బొకెట్ తదితరాలకు సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు తెస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది.
పూర్తి వివరాలు: https://main.trai.gov.in/notifications/press-release/trai-releases-amend...లో లభ్యం.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి