టెల్కోల ఆదాయానికి జియో గండి! | Vodafone seeks government relief to face Jio’s 4G phone freebies | Sakshi
Sakshi News home page

టెల్కోల ఆదాయానికి జియో గండి!

Aug 16 2017 12:51 AM | Updated on Aug 20 2018 9:18 PM

టెల్కోల ఆదాయానికి జియో గండి! - Sakshi

టెల్కోల ఆదాయానికి జియో గండి!

రిలయన్స్‌ జియో ఉచిత ఫీచర్ల ఫోన్ల వల్ల టెలికం పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని దేశీ రెండో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌ వొడాఫోన్‌ అభిప్రాయపడింది.

ఉచిత ఫోన్‌తో మరింతగా తగ్గే ప్రమాదం
టెలికం శాఖకు వొడాఫోన్‌ ఫిర్యాదు


న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో ఉచిత ఫీచర్ల ఫోన్ల వల్ల టెలికం పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని దేశీ రెండో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌ వొడాఫోన్‌ అభిప్రాయపడింది. జియో ఫోన్ల వల్ల ఆపరేటర్ల ఆదాయాలు మరింత తగ్గే ప్రమాదముందని పేర్కొంది. ‘ఇప్పటికే టెల్కోల ఆదాయాల్లో గణనీయమైన క్షీణత నమోదవుతోంది. మరొకవైపు తీవ్ర ఒత్తిడిలో ఉన్న టెలికం కంపెనీలు కేంద్ర ప్రభుత్వం విధించే పలు సుంకాలపై తగ్గింపును కోరుకుంటున్నాయి’ అని వివరించింది. కొత్త ఆపరేటర్‌ అయిన జియో తన సర్వీసులను పోటీ ధరల కన్నా తక్కువకే ఆఫర్‌ చేస్తోందని, అపరిమిత వాయిస్‌ కాల్స్‌తో కూడిన ఫీచర్‌ ఫోన్స్‌ కూడా ఇందులో భాగమేనని పేర్కొంది. దీని వల్ల ప్రస్తుత టెల్కోల ఆదాయాలు మరింత తగ్గే అవకాశముందని తెలిపింది.

సంస్థ ఈ విషయాలను పేర్కొంటూ టెలికం కమిషన్‌ సభ్యులు (ఫైనాన్స్‌) అనురాధ మిత్రకు ఒక లేఖ రాసింది. ‘మాకు టెలికం సర్వీసెస్‌ నుంచి వచ్చే ఆదాయం క్షీణిస్తూనే ఉంది. 2017 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలోనూ 3.41 శాతం తగ్గుదల నమోదయ్యింది’ అని వొడాఫోన్‌ వివరించింది. స్పెక్ట్రమ్‌ వాయిదా చెల్లింపులపై వడ్డీ రేట్లను తగ్గించాలని, దీని వల్ల ఆపరేటర్లకు కొంత ఉపశమనం కలుగుతుందని తెలిపింది. యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ (యూఎస్‌వో) సుంకాన్ని 5 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలనే ట్రాయ్‌ ప్రతిపాదనను పరిశీలించాలని డాట్‌ను కోరింది.

 అధికారిక సమాచారం ప్రకారం జనవరి–మార్చి త్రైమాసికంలో టెల్కోల సర్వీసుల ఆదాయం 15 శాతం క్షీణతతో రూ.40,831 కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే కాలంలో సర్వీసుల ఆదాయం రూ.48,379 కోట్లుగా ఉంది. కాగా ఆర్‌ఐఎల్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇటీవల రూ.1,500ల పూర్తి రిఫండబుల్‌ డిపాజిట్‌తో ఉచిత 4జీ ఫీచర్‌ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ల బుకింగ్స్‌ సెప్టెంబర్‌ 24 నుంచి ప్రారంభం కానున్నవి.   

లైసెన్స్‌ గడువు పొడిగించండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ సెల్యులార్‌ లైసెన్సు, స్పెక్ట్రమ్‌ గడువును మరో రెండేళ్ల పాటు .. 2022 దాకా పొడిగించాలని కేంద్రాన్ని కోరింది. తమకు 2000లోనే లైసెన్సు ఇచ్చినా కార్యకలాపాలు 2002లో ప్రారంభమయ్యాయని, ఈ నేపథ్యంలో 20 ఏళ్ల లైసెన్సు వ్యవధిని 2022 దాకా పొడిగించాలని కోరినట్లు సంస్థ చైర్మన్‌ అనుపమ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ముంబై, ఢిల్లీ మినహా బీఎస్‌ఎన్‌ఎల్‌ .. దేశవ్యాప్తంగా సర్వీసులు అందిస్తోంది.

 సుమారు 10 కోట్ల మంది యూజర్లతో 8.7 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ముంబై, ఢిల్లీలో కార్యకలాపాలు ఉన్న మరో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ఎంటీఎన్‌ఎల్‌ సైతం తమ లైసెన్సు గడువు కూడా 2021 దాకా రెండేళ్ల పాటు ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా పొడిగించాలంటూ ఇటీవలే కేంద్రాన్ని కోరింది. వివిధ కారణాల వల్ల పర్మిట్‌ అందిన తొలి నాలుగేళ్లలో లైసెన్సును పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement