‘విస్తార’ ఎగిరింది.. | Vistara takes off with inaugural Delhi-Mumbai flight | Sakshi
Sakshi News home page

‘విస్తార’ ఎగిరింది..

Jan 10 2015 1:13 AM | Updated on Sep 2 2017 7:27 PM

‘విస్తార’ ఎగిరింది..

‘విస్తార’ ఎగిరింది..

పారిశ్రామిక దిగ్గజ టాటా గ్రూప్ ఆరు దశాబ్దాల కల సాకారమైంది.

నెరవేరిన టాటాల ఆరు దశాబ్దాల కల
ఏవియేషన్‌లోకి రీఎంట్రీ
ఢిల్లీ నుంచి ముంబైకి తొలి ఫ్లయిట్
జేఆర్‌డీకి అంకితం ఇచ్చిన రతన్ టాటా

న్యూఢిల్లీ/ముంబై: పారిశ్రామిక దిగ్గజ టాటా గ్రూప్ ఆరు దశాబ్దాల కల సాకారమైంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలసి గ్రూప్ ఏర్పాటు చేసిన విస్తార సంస్థ సర్వీసులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలి ఫ్లయిట్ ఢిల్లీ నుంచి ముంబైకి ఎగిరింది. దీంతో టాటాలు మళ్లీ ఏవియేషన్ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చినట్లయింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.51కి ఎగిరిన విమానం ముంబైలో 2.46కి చేరుకుంది.

ఢిల్లీలో టేకాఫ్‌కి ముందు టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా శుభాకాంక్షలు తెలియజేయగా.. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ స్వాగతం పలికారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు, పలువురు ప్రముఖులు, సలాం బాలక్ ట్రస్ట్‌కి చెందిన బాలలు ఇందులో ప్రయాణించారు. ఆరు దశాబ్దాల క్రితం టాటా ఎయిర్‌లైన్స్.. ఎయిరిండియాగా రూపాంతరం చెందిన తర్వాత 1950వ దశకంలో ప్రభుత్వం దానిని జాతీయం చేసిన సంగతి తెలిసిందే.

అప్పట్నుంచి, టాటాలు పలు మార్లు విమానయాన రంగంలోకి  పునఃప్రవేశానికి ప్రయత్నించినా కుదరలేదు. ఇటీవలే మలేషియాకి చెందిన విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియాతో కలసి కొత్తగా ఎయిర్‌ఏషియా ఇండియాను టాటా గ్రూప్ ఏర్పాటు చేసింది. ఇందులో టాటా గ్రూప్‌కి 30% మైనారిటీ వాటాలు ఉన్నప్పటికీ.. రోజువారీ నిర్వహణ కార్యకలాపాల్లో జోక్యం ఉండదు. ఈ నేపథ్యంలోనే సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలసి విస్తారను ఏర్పాటు చేసింది. ఇందులో టాటాలకు 51% మెజారిటీ వాటా ఉంది. ప్రభుత్వ రంగ ఎయిరిండియా, ప్రైవేట్ సంస్థ జెట్ ఎయిర్‌వేస్ తర్వాత పూర్తి స్థాయి సర్వీసులు అందించే మూడో సంస్థ అవుతుంది విస్తార.
 
జేఆర్‌డీకి అంకితం..
భారత్‌లో ప్రపంచ స్థాయిలో పూర్తి సర్వీసులతో విమానయాన సంస్థ ఏర్పాటు చేయాలన్నది టాటా గ్రూప్ చిరకాల స్వప్నం అని రతన్ టాటా చెప్పారు. ‘ఆ కల నేడు సాకారమైంది. దీన్ని గ్రూప్ మాజీ చైర్మన్, దివంగత జేఆర్‌డీ టాటాకు అంకితమిస్తున్నాను’ అని ఆయన తెలిపారు. భారీ అంచనాలతో ప్రారంభించి, ఆ తర్వాత నిరాశపర్చకుండా ఎయిర్‌లైన్స్‌ను సవ్యంగా నిర్వహించాలన్నదే తమ లక్ష్యమని విస్తార చైర్మన్ ప్రసాద్ మీనన్ తెలిపారు.

‘పోటీ గురించి భయపడుతూ కూర్చుంటే ఏ వ్యాపారమూ ప్రారంభించలేము. అందరికీ అవకాశాలు ఉంటాయి. పోటీ అనేది అంతిమంగా కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది’ అని మీనన్ చెప్పారు. చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు తాము అనేక సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఏవియేషన్ మార్కెట్ వృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకుఎదురుచూస్తున్నామని, అది ఇప్పటికి సాకారం అయ్యిందని సింగపూర్ ఎయిర్‌లైన్స్(సియా) సీఈవో గో చూన్ ఫోంగ్ చెప్పారు.

2020 నాటి కి భారత్ మూడో అతి పెద్ద ఏవియషన్ మార్కెట్‌గా ఎదుగుతుందని కార్యక్రమంలో పాల్గొన్న పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. ఇందులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49% మేర అనుమతించ డం వల్ల మరిన్ని సంస్థలు రాగలవని ఆయన తెలిపారు.
 
విస్తార వివరమిదీ...
టాటా గ్రూప్, ఎస్‌ఐఏ ఎయిర్‌లైన్స్ కలసి భారత్‌లో విమానయాన సర్వీసులు ప్రారంభించేం దుకు గతంలో పలుమార్లు ప్రయత్నిం చినప్పటికీ కుదరలేదు. ఎట్టకేలకు గతేడాది ఇరు కంపెనీలు  విస్తార బ్రాండ్‌నేమ్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయగలిగాయి. ఫ్లయింగ్ పర్మిట్ల కోసం ఏప్రిల్‌లోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. సంవత్సరం ఆఖర్లో గానీ అనుమతులు లభించలేదు.

ఎట్టకేలకు జనవరి 9 నుంచి ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు డిసెంబర్ 18న సంస్థ ప్రకటించింది. విస్తార ప్రస్తుతం రెండు ఎ320 విమానాలను లీజుకి తీసుకుంది. ఢిల్లీ కేంద్రంగా ప్రారంభంలో ముంబై, అహ్మదాబాద్‌కు సర్వీసులు నడపనుంది. తొలి ఏడాదిలో హైదరాబాద్, గోవా, ముంబై తదితర ప్రాంతాలకు సేవలు విస్తరిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement