మాల్యాను వణికించిన ‘కత్తి’

Vijay Malya Gave Out Tippu Sulthan Personal Sword Like This He Dissipating His Assets - Sakshi

న్యూఢిల్లీ : టిప్పు సుల్తాన్‌ ఖడ్గానికి చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. 1782 నుంచి 1799 వరకు మైసూరును పాలించిన యోధుడు టిప్పు సుల్తాన్‌ కరవాలం శత్రువులకు మృత్యుదేవతగా కనిపించేది. భారతదేశం నుంచి బ్రిటీష్‌ వారిని తరిమికొట్టడానికి ఉపయోగించిన ఈ చారిత్రాత్మక ఖడ్గం నేడు కనిపించటం లేదు. 2004లో లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా ఈ ఖడ్గాన్ని ఒక ప్రైవేటు వేలంలో రూ.1.5 కోట్లకు తన సొంతం చేసుకున్నాడు. అయితే తాను సొంతం చేసుకున్న ఈ ఖడ్గాన్ని విజయ్‌మాల్యా 2016లో వదిలించుకున్నట్టు తెలిసింది. ఈ ఖడ్గాన్ని పొందినప్పటి నుంచి తనకు కలిసి రావడం లేదని, వెంటనే దాన్ని వదిలించుకోమని కుటుంబ సభ్యులు సలహా ఇవ్వడంతో, ఈ ఖడ్గాన్ని ఎవరో తెలియని వ్యక్తులకు ఇచ్చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఖడ్గానికి మార్కెట్‌ విలువ సుమారు 1.8 కోట్లు ఉంటుందని తెలిసింది.

దీన్ని ఆధారంగా చేసుకుని మాల్యాకు రుణాలిచ్చి మోసపోయిన 13 భారతీయ బ్యాంకుల తరఫున వాదిస్తున్న న్యాయవాది లండన్‌ హైకోర్టుకు ఒక విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. టిప్పు సుల్తాన్‌ ఖడ్గాన్ని వదిలించుకున్న మాదిరిగా... మాల్యా తన మిగతా ఆస్తులను కూడా పంచిపెట్టే అవకాశం ఉందని న్యాయవాది తన పత్రంలో పేర్కొన్నారు. అదే జరిగితే మాల్యాకు అప్పు ఇచ్చిన బ్యాంకులు ఆ రుణాలను తిరిగి వసూలు చేసుకునే అవకాశం ఉండదని వాపోయారు. అంతేకాకుండా ఆస్తులను పంచిపెట్టేందుకు వీలు లేకుండా.. ప్రపంచవ్యాప్తంగా మాల్యాకున్న ఆస్తుల మీద కోర్టు జారీ చేసిన ఫ్రీజ్‌ ఆర్డర్‌ను (ఆస్తులను స్తంభింపచేసే ఆదేశాలను) ఎత్తివేయరాదని ఆయన అభ్యర్థించారు. ఇందుకు మాల్యా తరుఫు న్యాయవాది వివరణ ఇస్తూ వేల కోట్ల రుణాలను ఖడ్గం విలువతో పోల్చి చూడటం సరికాదన్నారు. దీన్ని ఆధారంగా చేసుకొని మాల్యా తన ఆస్తులను అమ్ముకుంటున్నాడని లేదా దాస్తున్నాడని ఆరోపించటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

13 భారతీయ బ్యాంకుల నుంచి 9 వేల కొట్ల రూపాయలను రుణంగా పొంది... వాటిని తప్పుదోవ పట్టించిన మాల్యా లండన్‌కి పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాల్యాపై వివిధ కేసులు నమోదయ్యాయి. ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారుడుగా అభివర్ణించిన సీబీఐ, ఈ లిక్కర్‌ కింగ్‌ను భారత్‌కు రప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.  కేంద్ర ప్రభుత్వం సైతం మాల్యాను దేశానికి ఎలా రప్పించాలా? అని మల్లగుల్లాలు పడుతోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top