సొమ్ము మనది... జల్సా మాల్యాది | Vijay Mallya own home at Lady Walk | Sakshi
Sakshi News home page

సొమ్ము మనది... జల్సా మాల్యాది

Oct 5 2017 12:49 PM | Updated on Oct 5 2017 4:25 PM

Vijay Mallya own home at Lady Walk

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణాలకు ఎగనామం పెట్టి.. లండన్‌ పారిపోయిన విజయ్‌ మాల్యా అక్కడ కూడా ఖరీదైన జీవితాన్ని గడిపేస్తున్నాడు. భారతీయుల సొమ్ముతో ఉడాయించిన మాల్యా.. లండన్‌ ’లేడీ వాక్‌‘ ప్రాంతంలో అత్యంత ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బ్రిటన్‌లోని సీరియస్‌ ఫ్రాడ్ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఓ) కూడా ధృవీకరిస్తోంది. లేడీవాక్‌లోని విల్లాను విజయ్‌ మాల్య రూ.39.7 కోట్లతో కొనుగోలు చేసినట్లు ఎస్‌ఎఫ్‌ఓ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కు సమాచారమందించింది. మాల్యాకు సంబంధించిన మరిన్ని రహస్య వివరాలను ఎస్‌ఎఫ్‌ఓ.. సీబీఐకి అందించింది. ప్రస్తుతం మాల్యా నివాసముంటున్న లేడీవాక్‌ లండన్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు ఉంది. ఈ ప్రాంతంలోనే ఎఫ్‌-1 ఛాంపియన్‌ లూయీస్‌ హామిల్టన్‌తోపాటు మరికొందరు కోటీశ్వరులు ఇక్కడ నివాసముంటున్నారు.

వ్యాపారాల పేరిట విజయ్‌ మాల్య 17 బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు. అందులో ఒక్క ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి 900 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. ఇవన్నీ అసలు, వడ్డీ కలిపి రూ.9 వేల కోట్లకు చేరుకుంది. దీంతో అప్పులు చెల్లించలేక.. మాల్య లండన్‌ పారిపోయాడు. ఇదిలా ఉండగా.. యాక్సిస్‌ బ్యాంక్‌.. కింగ్‌ఫిషర్‌ అకౌంట్‌నుంచి అకౌంట్‌ నుంచి లండన్‌లోని మాల్యా అకౌంట్‌కు రూ. 242 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు ఎస్‌ఎఫ్‌ఓ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ ఏడాది జూన్‌లో విజయ్‌ మాల్యా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ..  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాల్య తన లండన్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ.117 కోట్లను స్విస్‌ బ్యాంక్‌ అకౌంట్‌కు మార్చే ప్రయత్నం చేస్తూ దొరికిపోయారు. ఈ నేపథ్యంలో మాల్యా అకౌంట్లను సీజ్‌ చేయాలంటూ సీబీఐ లండన్‌, స్విస్‌ బ్యాంకులను కోరింది. 

Advertisement
 
Advertisement
Advertisement