బంగారమయిన డాలర్‌..!

US tax reforms putting pressure on gold prices

పసిడికి వరుసగా నాల్గవ వారమూ నష్టాలే...

గరిష్టం నుంచి దాదాపు 100 డాలర్లు డౌన్‌

మరింత తగ్గుదలకే అవకాశం!  

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడ్‌ తన ఫండ్స్‌ రేటును పెంచడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో పసిడి పతనం కొనసాగుతోంది. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర  అక్టోబర్‌ 6వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 7 డాలర్లు నష్టపోయింది. 1,279 డాలర్ల వద్ద ముగిసింది.  పసిడి తగ్గుతూ రావడం వరుసగా ఇది నాల్గవ వారం. ఈ నాలుగు వారాల్లో దాదాపు 100 డాలర్ల నష్టాన్ని చూసింది.

శుక్రవారం ఒక దశలో డాలర్‌ ఇండెక్స్‌ 94.09ని చూసిన పరిస్థితుల్లో పసిడి 1,264 డాలర్లకు పడిపోయింది. అయితే సెప్టెంబర్‌లో పారిశ్రామికేతర ఉపాధి అవకాశాలు అంచనాలను మించి రాలేదన్న వార్త డాలర్‌ ఇండెక్స్‌ను 93.62 వద్దకు (వారం వారీగా 0.62 అప్‌) వద్దకు పడతోయగా, అదే సమయంలో పసిడి తిరిగి 1,279 డాలర్లకు దూసుకుపోయింది. అమెరికా ఆర్థిక పరిస్థితులు డాలర్‌ను మున్ముందు నిర్దేశిస్తాయని, ఆయా అంశాలే పసిడికి భవిష్యత్తును చూపిస్తాయని నిపుణుల అంచనా.

పసిడికి తక్షణ మద్దతు 1,250 డాలర్లను  కిందకు పడితే 1,212 డాలర్లను చూస్తుందని టెక్నికల్‌ అనలిస్టులు పేర్కొంటున్నారు.  1,210 స్థాయిలో పసిడి కొనుగోలు అవకాశమని వారు విశ్లేషిస్తున్నారు.  రేట్ల పెంపు అంచనా  మొత్తంమీద సమీప కాలంలో ఎల్లో మెటల్‌కు ప్రతికూలంగా, డాలర్‌ ఇండెక్స్‌కు అనుకూలంగా మారే వీలుందని భావిస్తున్నారు.  ఫెడ్‌ ఫండ్‌ రేటు (అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ రేటు.. ప్రస్తుతం 1–1.25 శాతం శ్రేణి) ఈ ఏడాది ఒకసారి, వచ్చే ఏడాది మూడుసార్లు పెంపు తథ్యమని అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సంకేతాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.  అయితే  దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక అనిశ్చితి ధోరణి, ఉత్తరకొరియాతో ఘర్షణాత్మక పరిస్థితి వంటి అంశాలు– పసిడి బులిష్‌ ట్రెండ్‌ను కొనసాగిస్తుందని భావిస్తున్నారు.

దేశంలో అంతర్జాతీయ ప్రభావం...
అంతర్జాతీయంగా పసిడి స్పీడ్‌కు బ్రేకులు పడిన వైనం భారత్‌లోనూ తన ప్రభావాన్ని కొనసాగించింది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత (వారం వారీగా పదిపైసలు తగ్గి రూ. 65.44) ఈ ధోరణి యథాతథానికి కారణమయ్యింది.

దేశీయంగా ఫ్యూచర్స్‌ మార్కెట్‌– మల్టీ కమోడిటీ ఎక్సే ్చంజ్‌లో పసిడి ధర దాదాపు రూ.300 తగ్గి రూ. 29,573 వద్ద ముగిసింది. ముంబై ప్రధాన స్పాట్‌ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు వారంవారీగా రూ. 335 తగ్గి రూ. 29,510కి చేరింది. 99.5 స్వచ్ఛత  ధర సైతం అదే స్థాయిలో తగ్గి రూ. 29,360కి చేరింది. ఇక వెండి కేజీ ధర రూ.560 తగ్గి రూ.38,850కి పడింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top