2017లోనూ నిరుద్యోగం...?

భారత్‌లో నిరుద్యోగం పెరగొచ్చు..!


ఐఎల్‌ఓ నివేదిక

జెనీవా: భారత్‌లో 2017–18 మధ్యకాలంలో నిరుద్యోగం స్వల్పంగా పెరగొచ్చనే అంచనాలు వెలువడ్డాయి. ఉపాధి కల్పనలో స్తబ్దత నెలకొనవచ్చని యూఎన్‌ లేబర్‌ రిపోర్ట్‌ పేర్కొంటోంది. ‘మేం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాం. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, కొత్తవారికి నాణ్యమైన ఉపాధి కల్పన, సామాజిక సమానత్వం వంటి సవాళ్లు ఉన్నాయి’ అని ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ గుయ్‌ రైడర్‌ తెలిపారు.



గతేడాది చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభాలు ఈ ఏడాదిలో శ్రామిక మార్కెట్లను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. అలాగే వర్ధమాన దేశాల్లో దిగజారుతోన్న శ్రామిక మార్కెట్‌ పరిస్థితులు కూడా ఈ ఏడాది నిరుద్యోగ రేటు పెరుగుదలకు కారణంగా నిలుస్తాయని తెలిపారు. యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) తాజాగా 2017 వరల్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ సోషియల్‌ ఔట్‌లుక్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం..



ఆర్థిక వృద్ధి ధోరణులు ఉద్యోగ కల్పనకు అనువుగా లేవు. ఈ ఏడాది నిరుద్యోగం పెరగొచ్చు. సామాజిక అసమానతలు కొనసాగే అవకాశముంది.

భారత్‌లో 2017, 2018లో ఉపాధి కల్పన పుంజుకోకపోవచ్చు. నిరుద్యోగులు ఈ ఏడాది 1.77 కోట్ల నుంచి 1.78 కోట్లకు, వచ్చే ఏడాది 1.8 కోట్లకు పెరగొచ్చని అంచనా. శాతాల వారీగా చూస్తే.. 2017–18లో నిరుద్యోగ రేటు 3.4 శాతంగా కొనసాగుతుంది.

గతేడాది దేశంలో ఉపాధి కల్పన ఒక మాదిరిగా ఉంది. దక్షిణాసియా ప్రాంతంలో జరిగిన మొత్తం ఉపాధి సృష్టిలో (1.34 కోట్ల ఉద్యోగాలు) అధిక భాగం భారత్‌దే. 

కార్మిక సిబ్బంది పెరుగుదలతో స్వల్పకాలంలో అంతర్జాతీయ నిరుద్యోగ స్థాయిలు కూడా అధికంగా ఉండొచ్చు. అంతర్జాతీయ నిరుద్యోగ రేటు 2017లో 5.8%కి పెరగొచ్చని అంచనా. ఇది గతేడాది 5.7 శాతంగా ఉంది.

2017లో వర్ధమాన దేశాల్లో నిరుద్యోగం పెరిగితే (5.6% నుంచి 5.7%కి), అభివృద్ధి చెందిన దేశాల్లో తగ్గుతుందని (6.3% నుంచి 6.2%కి) అంచనాలున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top