ఆల్ట్రాటెక్‌ లాభం 31 శాతం డౌన్‌ | UltraTech profit down 31 percent | Sakshi
Sakshi News home page

ఆల్ట్రాటెక్‌ లాభం 31 శాతం డౌన్‌

Oct 19 2017 1:13 AM | Updated on Oct 19 2017 1:21 AM

UltraTech profit down 31 percent

న్యూఢిల్లీ: అల్ట్రాటెక్‌ సిమెంట్‌ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 31 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.614 కోట్లుగా ఉన్న నికర లాభం... ఈ క్యూ2లో రూ.424 కోట్లకు తగ్గినట్లు అల్ట్రాటెక్‌ సిమెంట్‌ తెలిపింది. ఇక మొత్తం అమ్మకాలు రూ.6,667 కోట్ల నుంచి 6 శాతం పెరిగి రూ.7,091 కోట్లకు పెరిగాయి. ఇంధన ధరలు బాగా పెరగడంతో వ్యయాలు అధికం కావటం ఈ క్వార్టర్లో కూడా కొనసాగిందని వివరించింది. మొత్తం వ్యయాలు రూ.5,774 కోట్ల నుంచి 12 శాతం పెరిగి రూ.6,451 కోట్లకు చేరుకున్నాయి. ఇబిటా రూ.1,378 కోట్ల నుంచి 13% వృద్ధితో రూ.1,550 కోట్లకు ఎగసిందని సంస్థ తెలిపింది. నిర్వహణ మార్జిన్‌ 19% నుంచి 21%కి ఎగసింది.

వాల్‌కేర్‌ పుట్టీ ప్లాంట్‌ కోసం రూ.194 కోట్లు..
వాల్‌ కేర్‌ పుట్టీ ప్లాంట్‌ ఏర్పాటు కోసం రూ.194 కోట్లు పెట్టుబడుల పెట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో ఈ ప్లాంట్‌ ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొంది. జైప్రకాశ్‌ అసోసియేట్స్, జేపీ సిమెంట్‌ కార్ప్‌ కంపెనీల నుంచి ప్లాంట్లను కొనుగోలు చేయడం వల్ల తమ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 93 మిలియన్‌ టన్నులకు పెరిగిందని కంపెనీ తెలిపింది. ఈ ప్లాంట్ల కొనుగోళ్ల వల్ల  మధ్య భారత్, తూర్పు ఉత్తర ప్రదేశ్, తీర ఆంధ్ర ప్రాంతాల్లో మరింతగా బలపడ్డామని వివరించింది.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.2 శాతం లాభపడి రూ.4,080 వద్ద ముగిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement