Sakshi News home page

రెండేళ్లలో మెచ్యూరిటీ, సరెండర్ చేయాలా?

Published Mon, Jul 11 2016 1:06 AM

రెండేళ్లలో మెచ్యూరిటీ, సరెండర్ చేయాలా?

నేను ప్రవాస భారతీయుడ్ని. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై రూ. లక్షన్నర వరకూ మూలధన లాభాలు ఆర్జించాను. భారత్‌లో మరే ఇతర ఆదాయాలేవీ లేవు. నేను ఐటీఆర్‌ను దాఖలు చేయాలా? మూలధన లాభాల పన్ను చెల్లించాలా ?
- నవనీత్, విశాఖపట్టణం

 
ప్రవాస భారతీయుల విషయానికొస్తే, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకున్నప్పుడు, మూలం వద్దే పన్ను (టీడీఎస్-ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్)విధిస్తారు. మీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు ఏడాదిలోపే ఉపసంహరించుకుంటే, డెట్ లేదా గోల్డ్ ఫండ్స్‌కు అయితే 30 శాతం టీడీఎస్ ఉంటుంది. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌కు అయితే 15 శాతం టీడీఎస్ ఉంటుంది. అయితే మీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏడాదికి మించిన పక్షంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు.

ఇక డెట్ ఫండ్స్ విషయానికొస్తే.. మూడేళ్లలోపు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే, ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ రాబడులను మీ ఆదాయానికి కలిపి, మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఆదాయపు పన్ను విధిస్తారు. మూడేళ్ల తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే, వాటిని దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు.

ఈ రాబడులపై పన్ను  10 శాతం(ఇండేక్సేషన్‌తో కాకుండా), లేదా 20 శాతం(ఇండేక్సేషన్‌ను కలుపుకొని)గా పన్ను విధిస్తారు. దీనికి సెస్ అదనం. మీరు ప్రవాస భారతీయులు కాబట్టి, మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకున్నప్పుడే మూలధన లాభాల పన్ను విధిస్తారు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీరు  చెల్లించాల్సిన పన్ను, కోత విధించిన పన్ను కంటే తక్కువగా ఉంటే, ఆదాయపు పన్ను రిఫండ్ కోసం దరఖాస్తు చేయాలి.
 
నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)కు సంబంధించి.. రిటైర్మెంట్ తర్వాత మొత్తం కార్పస్‌లో 60 శాతాన్ని యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది కదా ! ఒకవేళ ఆ సబ్‌స్క్రైబర్ మరణిస్తే ఆ యాన్యుటీని ఆ వ్యక్తి వారసులకు చెల్లిస్తారా?                   
- రమేశ్, హైదరాబాద్

 
యాన్యుటీ అంటే దానిని కొనుగోలు చేసిన వ్యక్తికి రిటైర్మెంట్ తర్వాత  క్రమం తప్పకుండా ఆదాయం అందించేది. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)లో సబ్‌స్క్రైబర్ ఎంచుకోవడానికి  విభిన్నరకాలైన యాన్యుటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో లైఫ్‌టైమ్ యాన్యుటీ, లైఫ్‌టైమ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్, యాన్యుటీ విత్ జాయింట్ లైఫ్, లాస్ట్ సర్వైవర్ బెనిఫిట్స్.. ఇలా రకరకాలైన ఆప్షన్లు ఎంచుకోవడానికి అందుబాటులో ఉంటాయి.

అందుకని యాన్యుటీని ఎంచుకునేటప్పుడే డెత్ బెనిఫిట్స్, వారసులకు యాన్యుటీ బెనిఫిట్స్ లభిస్తాయో లేదో చెక్ చేసుకోవాలి. సబ్‌స్క్రైబర్ రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే, అసలైన కార్పస్ వారసులకు అందజేస్తారు. యాన్యుటీని మాత్రం ఆపేస్తారు. ఒకవేళ జాయింట్ యాన్యుటీని ఎంచుకుంటే, యాన్యుటీని  ఆ వ్యక్తి జీవిత భాగస్వామికి చెల్లిస్తారు.
 
నేను సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు ఎండోమెంట్ పాలసీ తీసుకున్నాను. 2010 తర్వాత దీనిని భారత్‌కు బదిలీ చేసుకున్నాను. 20 ఏళ్ల ఈ ప్లాన్ 2018లో మెచ్యూర్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ పాలసీ నుంచి వైదొలిగితే, నాకు నష్టమా, లాభమా? నన్ను ఏం చేయమంటారు ?
- యాదగిరి, కరీంనగర్


ఎండోమెంట్ ప్లాన్‌లు... బీమా, ఇన్వెస్ట్‌మెంట్ కలగలసిన హైబ్రిడ్ ప్లాన్‌లు. ఇవి తగిన బీమా కవర్‌ను ఇవ్వలేవు. మంచి రాబడినీ అందించలేవు. ఈ పాలసీలను సరెండర్ చేయమనే ఎప్పుడూ సలహాఇస్తాం. కానీ మీ విషయానికొస్తే, మరో రెండేళ్లలో ఈ ప్లాన్ మెచ్యూర్ అవుతోంది. 18 ఏళ్లపాటు ప్రీమియమ్‌లు చెల్లించారు. కాబట్టి ఈ ప్లాన్‌ను ఇప్పుడు సరెండర్ చేయడం సరికాదు. మరో రెండేళ్లలో మెచ్యూర్ అయ్యే ఈ పాలసీని ఇప్పుడు సరెండర్ చేస్తే మీకు భారీ నష్టాలు వస్తాయి. కొన్ని పాలసీల్లో సరెండర్ విలువగా మీరు చెల్లించిన ప్రీమియమ్‌ల్లో 30 శాతమే చెల్లిస్తారు.

తొలి ఏడాది ప్రీమియమ్‌ను మినహాయించుకుంటారు. దీనిని సరెండర్ చేయకుండా మరో మార్గం కూడా ఉంది. ఈ పాలసీని పెయిడప్ పాలసీగా మార్చుకోవచ్చు.  మీ బీమా కంపెనీని సంపదించి ఈ పెయిడప్ పాలసీని ఎంచుకుంటే ఎంత మొత్తం  వస్తుందో తెలుసుకోండి. సరెండర్ విలువతో ఈ పెయిడప్ పాలసీ విలువను పోల్చి ఈ పాలసీ నుంచి వైదొలగడం లాభమో, కాదో తేల్చుకోండి. మొత్తం మీద మీ ఎండోమెంట్ పాలసీ మెచ్యూరిటీకి రెండేళ్ల గడువు మాత్రమే ఉంది. కనుక ఈ పాలసీ నుంచి వైదొలగడం కంటే  కొనసాగించడమే సబబు.

ఇక భవిష్యత్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఇలాంటి హైబ్రిడ్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేయకండి. జీవిత బీమా కోసం పూర్తిగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోండి. ఇల్లు, కారు కొనుగోలు చేయడం, పిల్లల ఉన్నతాభ్యాసం వంటి  దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

Advertisement
Advertisement