చైనాకు మరోసారి షాకిచ్చిన ట్రంప్‌

Trump To Impose Additional $200 Billion Tariffs On Chinese Imports - Sakshi

వాషింగ్టన్‌ : ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ఉధృతమవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనాపై ట్రేడ్‌ వార్‌ బాంబు వేశారు. చైనా నుంచి దిగుమతి అయ్యే మరో 200 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. దీంతో ఆ దిగుమతులు అదనంగా 10 శాతం సుంకాలను ఎదుర్కోబోతున్నాయి.  ఇప్పటికే చైనాకు చెందిన పలు ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. వాటికి ప్రతీకారంగా ఇటీవలే చైనా కూడా 34 బిలియన్‌ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. దీనికి కౌంటర్‌గా అదనంగా 200 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై ఈ సుంకాలను అమెరికా విధించింది. ఇలా అమెరికా, చైనాలు సుంకాల మీద సుంకాలు విధించుకుంటూ.. వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. అమెరికా చర్యలకు  దీటుగా చైనా స్పందిస్తోంది. అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై కూడా అధిక సుంకాలు విధిస్తోంది. 

అయితే ప్రస్తుతం తాము చేపట్టిన టారిఫ్‌ యుద్ధం, చైనా అమెరికా మేథోసంపత్తి హక్కులను దొంగలించకుండా నిరోధిస్తుందని అమెరికా కార్యాలయ అధికారులు చెబుతున్నారు. చైనీస్‌ మార్కెట్‌లో యాక్సస్‌ పొందడానికి ట్రేడ్‌ సీక్రెట్లు చెప్పాలని అమెరికా కంపెనీలపై డ్రాగన్‌ ఒత్తిడి తెస్తుందని ఆరోపిస్తున్నారు. చైనా వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోందని వందల బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడుతోందని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. 

ఇది తమ ఆర్థికవ్యవస్థకు భవిష్యత్తులో ముప్పు కలిగిస్తుందని అమెరికా అధ్యక్ష ప్రధాన వాణిజ్య సందానకర్త రాబర్ట్‌  అన్నారు. ట్రంప్‌ ప్రస్తుతం చైనాపై తీసుకున్న ఈ చర్య వల్ల టెలివిజన్లు, వస్త్రాలు, బెడ్‌షీట్లు, ఎయిర్‌కండీషనర్లు ప్రభావితం కానున్నాయి. అమెరికా తీసుకుంటున్న ఈ చర్యలకు ఇతర మార్గాల్లో కూడా ప్రతీకారం తీసుకోవాలని చైనా అధికారులు భావిస్తున్నారు.  చైనాలో కార్యకలాపాలు సాగిస్తున్న అమెరికా కంపెనీల్లో చెప్పాపెట్టకుండా తనిఖీలు, ఆర్థిక లావాదేవీల ఆమోదంలో జాప్యం, ఇతర కార్యాలయ తలనొప్పులను అమెరికా కంపెనీలకు విధించాలని డ్రాగన్‌ చూస్తోంది.

ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకం విధిస్తున్నాయని, అమెరికాలో మాత్రం ఆయా దేశాల ఉత్పత్తులపై తక్కువ సుంకాలు విధిస్తున్నామని, ఇలా కాకుండా పరస్పరం ఒకే విధమైన సుంకాలు విధించే విధానం ఉండాలని డొనాల్డ్‌ ట్రంప్‌ అంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఇతర దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచుతూ వస్తున్నారు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. తొలుత స్టీట్‌, ఉక్కులపై సుంకాలు పెంచుతూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top