థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల కొనుగోలుకు ఎన్‌టీపీసీ టెండర్‌

thermal power plants to NTPC Tender - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ, ఎన్‌టీపీసీ..భారత్‌లో థర్మల్‌ విద్యుదుత్పత్తి ప్లాంట్లను కొనుగోలు చేయనున్నది. ఏప్రిల్‌ 1, 2014 తర్వాత కార్యకలాపాలు ప్రారంభించిన బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లను కొనుగోలు చేయనున్నామని ఎన్‌టీపీసీ తెలిపింది. ఈ మేరకు టెండర్లను పిలిచినట్లు పేర్కొంది.  ఏప్రిల్‌ 1, 2014 తర్వాత కార్యకలాపాలు ప్రారంభించిన 12 గిగావాట్ల, రూ.56,000 కోట్ల విలువైన విద్యుత్‌ ప్లాంట్లకు మాత్రమే అర్హత ఉంటుందని వివరించింది. ఒక్కో ప్లాంట్‌కు  కనీసం 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉండాలని, సబ్‌క్రిటికల్, సూపర్‌క్రిటికల్‌  పవర్‌ ప్లాంట్లను మాత్రమే కొనుగోలు చేస్తామని తెలిపింది.

 వంద శాతం దేశీయ బొగ్గుతోనే పనిచేసేట్లుగా ఈ ప్లాంట్ల డిజైన్‌ ఉండాలని సూచించింది. 85 శాతం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌(పీఎల్‌ఎఫ్‌) సాధించడానికి సరిపడే బొగ్గు నిల్వలు ఉండి తీరాలని పేర్కొంది. దరఖాస్తు చేసిన అన్ని ప్లాంట్లను పరిశీలించి తాము కొనుగోలు చేయడానికి తగిన ప్లాంట్లను షార్ట్‌లిస్ట్‌ చేస్తామని వివరించింది. ఎవరైనా ప్రమోటర్‌/రుణ దాత/ఆర్థిక సంస్థలు/డెవలపర్లు/ఇండిపెండెంట్‌ విద్యుదుత్పత్తి సంస్థలు తమ తమ  విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఆఫర్‌ చేయవచ్చని ఎన్‌టీపీసీ పేర్కొంది.  

ఎన్‌టీపీసీ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 51,708 మెగావాట్లుగా ఉంది. మొత్తం 28 థర్మల్‌ ప్లాంట్లు, 8 గ్యాస్‌/లిక్విడ్‌ ఇంధన విద్యుదుత్పత్తి ప్లాంట్లు, 13 నవీకరణ (జల, పవన, సౌర)విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. 20వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎన్‌టీపీసీ మరిన్ని థర్మల్‌ విద్యుదుత్పత్తి ప్లాంట్లను చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top