ఇప్పట్లో ఆఫీస్‌ లేనట్టే!

Tech Companies In No Hurry To Return To Office - Sakshi

గడప దాటకుండానే..

బెంగళూర్‌ : లాక్‌డౌన్‌ నియంత్రణలను ప్రభుత్వం భారీగా సడలించినా పలు ఐటీ, టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికిప్పుడు కార్యాలయాల్లో పూర్తిస్ధాయి సిబ్బందితో పనిచేయించేందుకు సిద్ధంగా లేవు. ఐటీ, టెక్నాలజీ కంపెనీలు ఇంటర్‌నెట్‌తో తమ పనులు చక్కబెట్టుకునే అవకాశం ఉండటంతో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నా ఉత్పాదకతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదు. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న క్రమంలో మరికొద్ది నెలలు ఇదే విధానం కొనసాగించాలని ఐటీ కంపెనీలు యోచిస్తున్నాయి. కార్యాలయాల్లో నామమాత్రపు సిబ్బందిని అనుమతించాలని, అదీ రొటేషన్‌ విధానంలో అనుసరించాలని మరికొన్ని కంపెనీలు భావిస్తున్నాయి.

ఉద్యోగుల వెసులుబాటుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని పలు ఐటీ కంపెనీలు యోచిస్తున్నాయి. 5,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్న గోల్డ్‌మన్‌ శాక్స్‌ బెంగళూర్‌ సర్వీస్‌ సెంటర్‌లో మరికొద్ది నెలల పాటు కేవలం 30 శాతం మందినే కార్యాలయం నుంచి పనిచేయించాలని కంపెనీ భావిస్తోంది. జూన్‌ మాసాంతంలో దశల వారీగా సిబ్బందిని అనుమతించాలని భావిస్తోంది. ఆఫీస్‌ నుంచి తిరిగి పనిచేయడమనేది ఉద్యోగులు స్వచ్ఛందంగా వారి వెసులుబాటు, సౌకర్యాన్ని బట్టి వారే నిర్ణయం తీసుకుంటారని గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇండియా హెడ్‌ గుంజన్‌ సంతాని పేర్కొన్నారు.

ఇక ఉద్యోగి ప్రతి రెండు వారాలకు ఒక రోజు ఆఫీస్‌లో పనిచేసే విధానంపై సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్‌ కసరత్తు సాగిస్తోంది. తమ కార్యాలయ భవనాల్లో పది శాతం ఉద్యోగులు మాత్రమే ఉండేలా గూగుల్‌ యోచిస్తోంది. ఇక సెప్టెంబర్‌ నాటికి భవనాల సామర్ధ్యంలో 30 శాతం వరకూ ఉద్యోగులను రొటేషన్‌ విధానంలో అనుమతించాలని యోచిస్తోంది. మరోవైపు ఈ ఏడాదంతా ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటును ఉద్యోగులకు కల్పిస్తామని ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. తొలుత 25 శాతం సిబ్బందితో కార్యాలయాలను తెరిచేందుకు ఫేస్‌బుక్‌ సన్నాహాలు చేస్తోంది.

చదవండి : లాక్‌డౌన్‌ వారికి వరమే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top