
లాభాల బాటలో టాటా స్టీల్...
టాటా స్టీల్ మళ్లీ లాభాల బాట పట్టింది. అమ్మకాలు మెరుగుపడడం, ఉక్కు ఉత్పత్తుల ధరలు అధికంగా ఉండడం, తదితర కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం
ఈ క్యూ3లో రూ.231కోట్ల లాభం
న్యూఢిల్లీ: టాటా స్టీల్ మళ్లీ లాభాల బాట పట్టింది. అమ్మకాలు మెరుగుపడడం, ఉక్కు ఉత్పత్తుల ధరలు అధికంగా ఉండడం, తదితర కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ.231 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జిం చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.2,748 కోట్ల నికర నష్టాలు వచ్చాయని టాటా స్టీల్ తెలిపింది. స్థూల అమ్మకాలు రూ.25,662 కోట్ల నుంచి రూ.29,279 కోట్లకు పెరిగాయని టాటా స్టీల్ ఎండీ(ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా) టి. వి. నరేంద్రన్ చెప్పారు. వివిధ విభాగాల దన్నుతో, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు వంటి సమస్యలున్నప్పటికీ పటిష్టమైన అమ్మకాలను సాధించామని చెప్పారు.
అయితే గ్రామీణ మార్కెట్లో అమ్మకాలు తక్కువగా ఉండడం, వినియోగదారుల సెంటిమెంట్ ప్రతికూలంగా ఉండడం కొంత ప్రభావం చూపాయని అంగీకరించారు. వ్యయ నియంత్రణ పద్ధతులు, సమగ్రంగా కార్యకలాపాలు నిర్వహించడం వంటి కారణాల వల్ల ముడి పదార్ధాల ధరలు పెరిగిన ప్రభావాన్ని తట్టుకున్నామని నరేంద్రన్ వివరించారు. కళింగనగర్ ప్లాంట్ పునర్వ్యస్థీకరణ పనులు సజావుగానే జరుగుతున్నాయని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి స్థూల రుణ భారం రూ.84,752 కోట్లుగా, నికర రుణ భారం రూ.76,680 కోట్లుగా ఉందని తెలిపారు. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.15,000 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు.
టాటా స్టీల్ చైర్మన్‌గా చంద్రశేఖరన్
టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్ర శేఖరన్ టాటా స్టీల్ బోర్డ్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన టీసీఎస్ సీఈఓగా, ఎండీగాగా ఉన్నారు. చైర్మన్‌గా ఎన్నికవడం గౌరవంగా భావిస్తున్నానని. వినమ్రంగా ఆ బాధ్యతను స్వీకరిస్తున్నానని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. మిస్త్రీ తొలగింపు తర్వాత గత నెల 13న చంద్రశేఖరన్ టాటా స్టీల్ డైరెక్టర్‌గా వచ్చారు.