తక్షణం రూ. 1.2 లక్షల కోట్లు కావాలి!

State-run banks need rs 1.2 tn in urgent capital : Crisil - Sakshi

ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన అవసరాలపై క్రిసిల్‌ నివేదిక

ముంబై: అంతర్జాతీయ బ్యాంకింగ్‌ ప్రమాణాలను పాటించే క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) రాబోయే అయిదు నెలల్లో రూ. 1.2 లక్షల కోట్ల మేర మూలధనం అవసరమవుతుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఒక నివేదికలో పేర్కొంది. పీఎస్‌బీలు బలహీన మార్కెట్‌ వాల్యుయేషన్స్, మొండిబాకీలతో కుదేలైన నేపథ్యంలో ఇందులో సింహభాగం భారం ప్రభుత్వమే మోయాల్సి ఉంటుందని తెలిపింది.

అయితే, ఒకవేళ ప్రభుత్వం ఈ మేరకు నిధులు సమకూర్చిన పక్షంలో ఆర్థిక గణాంకాలు లెక్క తప్పే ప్రమాదముందని, ఈసారి ద్రవ్య లోటును 3.3 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని కేంద్రం చేరుకోలేకపోవచ్చని నివేదికను రూపొందించిన క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ కృష్ణన్‌ సీతారామన్‌ తెలిపారు.  పీఎస్‌బీలకు రూ. 2.11 లక్షల కోట్ల అదనపు మూలధనం సమకూరుస్తామంటూ 2017 అక్టోబర్‌లో కేంద్రం ప్రకటించింది. ఇప్పటిదాకా ఇందులో రూ. 1.12 లక్షల కోట్లు సమకూర్చగా, బ్యాంకులు మరో రూ. 12,000 కోట్లు మాత్రమే మార్కెట్ల నుంచి సమీకరించుకోగలిగాయి.

పనితీరు అంతంతమాత్రంగానే ఉండటం, వాల్యుయేషన్లు బలహీనంగా ఉండటం వంటి ప్రతికూలతల కారణంగా పీఎస్‌బీలు ప్రస్తుతం మార్కెట్ల నుంచి మరిన్ని నిధులు సమీకరించుకునే పరిస్థితి లేదని కృష్ణన్‌ తెలిపారు. అయితే, పటిష్టమైన బ్యాంకుల్లో బలహీనంగా ఉన్న వాటిని విలీనం చేయడం ద్వారా అదనపు మూలధన అవసరాలు కొంత మేర తగ్గొచ్చని క్రిసిల్‌ అసోసియే ట్‌ డైరెక్టర్‌ వైద్యనాథన్‌ రామస్వామి చెప్పారు. మార్కెట్ల నుంచే మూలధనం సమీకరించుకునేలా మెరుగ్గా ఉన్న బ్యాంకులను ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు.

రూ. 20 వేల కోట్ల సమీకరణలో ఎస్‌బీఐ..
కార్యకలాపాల విస్తరణ తదితర అవసరాల కోసం రూ. 20,000 కోట్లు సమీకరించనున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ సహా వివిధ మార్గాల్లో ఈ నిధులు సమీకరించనున్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు డిసెంబర్‌ 7న బ్యాంక్‌ షేర్‌హోల్డర్లు సమావేశం కానున్నట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top