హైదరాబాద్‌ సమీపంలో స్టాండర్డ్‌ గ్లాస్‌ కొత్త ప్లాంటు

Standard Glass New Plant Near Hyderabad - Sakshi

జిన్నారం వద్ద రూ.35 కోట్లతో ఏర్పాటు 

ఈ ఏడాది రూ.140 కోట్ల టర్నోవర్‌ 

సాక్షి, హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ, రసాయనాల ఉత్పత్తికి అవసరమైన కీలక పరికరాల తయారీలో ఉన్న స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ మరో ప్లాంటును నెలకొల్పుతోంది. హైదరాబాద్‌ సమీపంలోని జిన్నారం వద్ద రూ.35 కోట్లతో దీనిని స్థాపిస్తోంది. ఏప్రిల్‌లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని స్టాండర్డ్‌ గ్రూప్‌ ఎండీ కందుల నాగేశ్వర రావు సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. నెలకు 200ల రియాక్టర్ల తయారీ సామర్థ్యంతో ఇది రానుందని చెప్పారు. ఇప్పటికే కంపెనీకి జీడిమెట్ల వద్ద రియాక్టర్ల తయారీ కేంద్రాలు రెండున్నాయి. ఈ రెండు యూనిట్లకు రూ.35 కోట్లు వెచ్చించారు. 63 నుంచి 20,000 లీటర్ల కెపాసిటీ గల రియాక్టర్లను రూపొందిస్తున్నారు. 2018–19లో రూ.80 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.140 కోట్లు లక్ష్యంగా చేసుకుంది. 

దేశంలో తొలిసారిగా...: జపాన్‌ సంస్థ హక్కో సాంగ్యోతో స్టాండర్డ్‌ గ్లాస్‌ చేతులు కలిపింది. ఈ కంపెనీ భాగస్వామ్యంతో దేశంలో తొలిసారిగా కండక్టివిటీ గ్లాస్‌ లైనింగ్‌ రియాక్టర్లను స్టాండర్డ్‌ ప్రవేశపెట్టనుంది. ఈ రియాక్టర్లతో విద్యుత్‌ ప్రమాదాలు జరగవని కంపెనీ చెబుతోంది. డిసెంబరు నుంచి ఇవి మార్కెట్లోకి రానున్నాయి. జీడిమెట్లతోపాటు కొత్తగా రానున్న ప్లాంటులోనూ ఇవి తయారు చేస్తారు. 32,000 లీటర్ల సామర్థ్యం గల రియాక్టర్లు సైతం జిన్నారం యూనిట్‌లో రూపుదిద్దుకోనున్నాయి. కాగా, స్టాండర్డ్‌ గ్లాస్‌ దక్షిణాదిన అగ్ర శ్రేణి కంపెనీగా ఉంది. 400లకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. ఇప్పటి వరకు 4,000 పైచిలుకు రియాక్టర్లను సరఫరా చేసింది. ఒమన్, టర్కీ, దుబాయిలోనూ కస్టమర్లున్నారు. త్వరలో రష్యాకు సరఫరా చేయనుంది. 

అయిదేళ్లలో రూ.1,000 కోట్లు.. 
స్టాండర్డ్‌ గ్రూప్‌ 2010లో ప్రారంభమైంది. ప్రస్తుతం సంస్థకు 800 మంది ఉద్యోగులున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.330 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. 2019–20లో రూ.400 కోట్లు ఆశిస్తోంది. అయిదేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది లక్ష్యమని నాగేశ్వర రావు వెల్లడించారు. ‘మరిన్ని ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు ప్రవేశపెడతాం. ప్రస్తుతం ఎగుమతుల వాటా 5 శాతమే. 2024 నాటికి ఎగుమతులను 50 శాతానికి చేర్చాలన్నది మా ధ్యేయం. గ్రూప్‌ కింద ఎనిమిది తయారీ కేంద్రాలున్నాయి. యూకేలో ఆర్‌అండ్‌డీ కేంద్రం ఉంది’ అని వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top