
న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాల్లో నెలవారీ కనీస మొత్తం నిల్వ నిబంధనను పాటించని ఖాతాదారుల నుంచి జరిమానాల రూపంలో ఎస్‌బీఐ భారీగానే సొమ్ములు రాబడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో ఈ జరిమానాలు రూ.1,772 కోట్లకు పెరిగాయి. ఈ బ్యాంక్ సాధించిన రెండో క్వార్టర్ నికర లాభం(రూ.1,582 కోట్లు) కన్నా ఈ మొత్తం అధికం కావడం విశేషం. కాగా ఈ 8 నెలల కాలం పూర్తయిన తర్వాత మొత్తం 40.5 కోట్ల సేవింగ్స్ ఖాతాలను ఎస్‌బీఐ మూసేసింది.
కనీస నిల్వ పాటించని ఖాతాదారుల నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.97 కోట్లు వసూళ్లు చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లు రూ.50 కోట్లకు పైగా వసూలు చేశాయి. కాగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, చిన్న ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు, పెన్షనర్ల, మైనర్ల, సామాజిక ప్రయోజనకర ఖాతాలకు ఈ కనీస నిల్వ నిబంధనను వర్తింపజేయడం లేదని, ఈ ఖాతాల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.