ఎస్‌బీఐ కార్డు యూజర్లూ జర జాగ్రత్త

SBI Card cautions customers against Bitcoin investment - Sakshi

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద క్రెడిట్‌ కార్డు జారీదారి అయిన ఎస్‌బీఐ కార్డు తన కస్టమర్లకు హెచ్చరికలు జారీచేసింది. బిట్‌కాయిన్‌, ఇతర క్రిప్టోకరెన్సీలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించింది. ఇలాంటి పెట్టుబడులకు తమ క్రెడిట్‌ కార్డు వాడకాన్ని రద్దు చేయనప్పటికీ, యూజర్లు జాగురకతతో వ్యవహరించాలని పేర్కొంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఫైనాన్సియల్‌ ఇన్‌స్టిట్యూషన్లకు, ప్రజలకు జారీచేసిన ప్రకటనలో క్రిప్టోకరెన్సీ స్కీమ్‌లు, బిట్‌ కాయిన్‌ లాంటి ఇతర వర్చ్యువల్‌ కరెన్సీలకు ఎలాంటి లైసెన్సు లేదా అథరైజేషన్‌ ఇవ్వలేదని తెలుపుతూ ఎస్‌బీఐ కార్డు పంపిన తన కస్టమర్లకు మెసేజ్‌లు పంపింది. 

అంతర్జాతీయంగా, స్థానికంగా వీటిపై ఆందోళనలు ఉన్నాయని, క్రిప్టోకరెన్సీలు, వర్చ్యువల్‌ కరెన్సీలతో డీల్‌ చేసేటప్పుడు భద్రతాపరమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో కూడా ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలను చట్టబద్ధమైనవిగా గుర్తించడం లేదని తెలిపారు. పేమెంట్‌ సిస్టమ్‌లో వీటి వాడకాన్ని నిర్మూలించాలన్నారు. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుకు 50 లక్షల మందికి పైగా కస్టమర్లున్నారు. కాగ, ఈ నెల ప్రారంభంలోనే సిటీ ఇండియా బ్యాంకు తన డెబిట్‌, క్రెడిట్ కార్డుల ద్వారా క్రిప్టోకరెన్సీలు లేదా వర్చ్యువల్‌ కరెన్సీలు కొనుగోలు చేయడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top