ఎస్‌అండ్‌పీ వార్నింగ్-మార్కెట్లో అమ్మకాలు | S&P outlook on India triggers Sensex fall; Nifty slips below 8800 | Sakshi
Sakshi News home page

ఎస్‌అండ్‌పీ వార్నింగ్-మార్కెట్లో అమ్మకాలు

Feb 24 2015 2:41 AM | Updated on Oct 2 2018 8:16 PM

ఎస్‌అండ్‌పీ వార్నింగ్-మార్కెట్లో అమ్మకాలు - Sakshi

ఎస్‌అండ్‌పీ వార్నింగ్-మార్కెట్లో అమ్మకాలు

కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు మరో ఐదు రోజుల్లో వెల్లడికానున్న నేపథ్యంలో భారత్ రేటింగ్ పట్ల ప్రసిద్ధ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) హెచ్చరికలు జారీచేయడంతో సోమవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు.

- సెన్సెక్స్ 256 పాయింట్లు డౌన్
- 78 పాయింట్లు తగ్గిన నిఫ్టీ
- క్షీణించిన బ్యాంకింగ్, ఆయిల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు
- మార్కెట్  అప్‌డేట్

ముంబై: కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు మరో ఐదు రోజుల్లో వెల్లడికానున్న నేపథ్యంలో భారత్ రేటింగ్ పట్ల ప్రసిద్ధ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) హెచ్చరికలు జారీచేయడంతో సోమవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు.

ప్రపంచ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ ఫలితంగా ట్రేడింగ్ తొలిదశలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 29,362 పాయింట్ల స్థాయికి పెరిగినప్పటికీ, అటుతర్వాత కొన్ని బ్లూచిప్ షేర్లలో అమ్మకాలు వె ల్లువెత్తడంతో 29,913 పాయింట్ల వద్దకు పతనమయ్యింది. చివరకు క్రితం ముగింపుకంటే 256 పాయింట్ల క్షీణతతో 29,975 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 78 పాయింట్ల తగ్గుదలతో 8,755 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

ద్రవ్య పరిస్థితి బలహీనంగా వుండటం, ఆదాయస్థాయిలు కనిష్టంగా కొనసాగడం వల్ల భారత్ సార్వభౌమ రేటింగ్‌కు విఘాతం ఏర్పడుతున్నదంటూ ఎస్ అండ్ పీ హెచ్చరించింది. ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు జరిగాయి.  ప్రధాన షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, గెయిల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌లు 2-2.5 శాతం మేర తగ్గాయి.  

విలీనానికి అనుమతి కాంపిటీషన్ కమిషన్ అనుమతి లభించడంతో కొటక్ మహీంద్రా, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకుల షేర్లు పెరిగాయి.బొగ్గు గనుల వేలంలో గరిష్టంగా 3 బొగ్గు బ్లాకులను దక్కించుకున్నందున, హిందాల్కో ఇండస్ట్రీస్ షేరు ట్రేడింగ్ తొలిదశలో 3 శాతంపైగా ర్యాలీ జరిపి రూ. 161.8 స్థాయికి చేరినప్పటికీ, ముగింపులో లాభాల స్వీకరణతో రూ. 154.8 స్థాయికి తగ్గి ముగిసింది.  

సెన్సెక్స్‌లోని 24 షేర్లు క్షీణించగా, 6 షేర్లు మాత్రం పెరిగాయి. ఎక్సేంజీల్లో వ్యాపార లావాదేవీలు గత శుక్రవారంతో పోలిస్తే తగ్గాయి. బీఎస్‌ఈ నగదు విభాగంలో టర్నోవర్ రూ. 3,570 కోట్లకు తగ్గగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగం టర్నోవర్ రూ. 17,304 కోట్లకు పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.602 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ164 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement