గ్లోబల్‌ సంస్థను  చేజిక్కించుకున్న రిలయన్స్‌

Reliance Brands  buys Hamleys - Sakshi

ప్రపంచంలోనే అతిపెద్దదైన, పురాతనమైన  బ్రిటిష్‌ టోయ్‌ రీటైలర్‌ హామ్లీస్‌ను వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సొంతం చేసుకున్నారు. చిన్న పిల్లల బొమ్మల మార్కెట్‌పై  మంచి పట్టు  ఉన్న గ్లోబల్‌ కంపెనీ  హామ్లీస్‌పై ఎప్పటినుంచో  కన్నేసిన రిలయన్స్‌ రీటైల్‌ ఎట్టకేలకు ఆ కంపెనీని చేజిక్కించుకుంది.  

రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్, హాంకాంగ్ లిస్టింగు కంపెనీ సి బ్యానర్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్నుంచి హామ్లిస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో 100 శాతం షేర్లను కొనుగోలు చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. 260 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ సంస్థ హామ్లీస్‌ను కొనుగోలు చేసినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇందుకోసం  67.96 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.620 కోట్లు) నగదు ఒప్పందం పూర్తి చేసినట్టు ప్రకటించింది.  

చైనాకు చెందిన సి బ్యానర్ ఇంటర్నేషనల్ నుంచి హమ్లీస్‌ను కొనుగోలు చేసే ఒప్పందంపై సంతకం చేసినట్టు రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ పేర్కొంది. అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన హమ్లీస్‌ సంస్థను ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకోవాలన్న తమ చిరకాల స్వప్నం నేడు నెరవేరిందని  రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ సీఈఓ దర్శన్ మెహత్ పేర్కొన్నారు.

1760లో లండన్‌లో నోవాస్‌గా మొదలైన సంస్థ ఆ తర్వాత కాలక్రమంలో హామ్లీస్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలలో 167 దుకాణాలున్నాయి. అందులోనూ  ఇండియాలో హామ్లీస్‌ 29 నగరాల్లో 88 స్టోర్లను కలిగి ఉంది.  యూకె, చైనా, జర్మనీ, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా సహా మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఈ స్టోర్స్ ఉన్నాయి.  వాటిల్లో అధిక శాతం ఫ్రాంచైజీ మోడల్‌. ఇక ఇప్పటికీ సుమారు 50 వేల బొమ్మలను ఆన్ లైన్‌లో విక్రయానికి పెట్టింది ఈ సంస్థ. లండన్‌లో ఇప్పటికీ హామ్లీస్ స్టోర్ ఓ సూపర్ టూరిస్ట్ అట్రాక్షన్. ఏటా సుమారు 50 లక్షల మంది ఈ స్టోర్‌ను సందర్శిస్తూ ఉంటారు. మరోవైపు బ్రెగ్జిట్, అంతర్జాతీయ తీవ్రవాదం కారణంగా గత సంవత్సరం హమ్లీస్‌ సుమారు రూ.84 కోట్ల నష్టాన్ని సంస్థ ప్రకటించడం గమనార్హం.

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top