బ్యాంకుల చేతికి రూ.37,000 కోట్లు!

RBI defers capital buffer norms by a year, leaves Rs 37000 cr in hands - Sakshi

ముంబై: దేశంలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితులను చక్కదిద్దడంలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. క్యాపిటల్‌ కన్జర్వేషన్‌ బఫర్‌ (సీసీబీ) నియమామళిని ఏడాదిపాటు వాయిదా వేస్తున్నట్లు ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీనితో బ్యాంకులకు దాదాపు రూ.37,000 కోట్ల మూలధనం అందుబాటులోకి వస్తాయని అంచనా. ప్రస్తుతం బ్యాంకుల సీసీబీ ప్రధాన క్యాపిటల్‌లో 1.875 శాతం. ఈ కనీస క్యాపిటల్‌ కన్షర్వేషన్‌ రేషియోను 2019 మార్చి నుంచి 2.5 శాతానికి పెంచాలి. తాజా నిర్ణయంతో ఈ నిర్ణయం 2020 మార్చి 31 నుంచీ అమల్లోకి వస్తుంది. సీసీబీ అనేది ఒక మూలధన నిల్వ. సాధారణ సమయంలో దీనిని బ్యాంకులు పెంచుకుంటాయి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అవసరాలకు వినియోగించుకుంటాయి. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం సమయంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇబ్బందికర సమయంలో ఆదుకునే మరో సాధనం క్యాపిటల్‌ అడిక్వసీ రేషియో (సీఏఆర్‌) ప్రస్తుతం 9 శాతంగా ఉంది.   

విప్రో ఏరోస్పేస్‌ ఎగుమతులు ఆరంభం
బెంగళూరు: విప్రో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజినీరింగ్‌ (విన్‌) కంపెనీ విమాన విడిభాగాల ఎగుమతులు ఆరంభమయ్యాయి. విమాన విడిభాగాలను బోయింగ్‌ కంపెనీకి ఎగుమతి చేయడం ప్రారంభించినట్లు విన్‌ కంపెనీ వెల్లడించింది. ఇక్కడకు సమీపంలోని దేవనహళ్లి ప్లాంట్‌లో ఈ విమాన విఢిభాగాలను తయారు చేస్తున్నామని విన్‌ సీఈఓ ప్రతీక్‌ కుమార్‌ చెప్పారు. బోయింగ్‌ 737 మ్యాజ్, నెక్స్‌ట్‌ జనరేషన్‌ 737 విమానాలకు అవసరమైన విడిభాగాలను తయారు చేసి, సరఫరా చేయడానికి బోయింగ్‌ కంపెనీతో తమ విప్రో ఏరోస్పేస్‌ ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారాయన.  


విస్తరణ ప్రణాళికలో కర్లాన్‌

హైదరాబాద్‌: నూతన ఆవిష్కరణలు, సాంకేతికతపై వచ్చే రెండేళ్లలో రూ.200 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ప్రముఖ పరుపుల ఉత్పత్తి సంస్థ కర్లాన్‌ ప్రకటించింది. ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను రెట్టింపు చేయడంలో భాగంగా ఈమేరకు పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ సీఎండీ టీ సుధాకర్‌ పాయ్‌ తెలిపారు. గతేడాది అమ్మకాల్లో 25 శాతం వృద్ధి సాధించగా.. వచ్చే మూడేళ్లలో రూ.2000 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు వెల్లడించారు.  

డబ్ల్యూఈఎఫ్‌లో ఏటీటీ సదస్సుకు సింగ్‌ సారథ్యం
ముంబై: ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ సీఈవో అజయ్‌ సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 22 నుంచి 25 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో భాగంగా ఏవియేషన్, ట్రావెల్, టూరిజం (ఏటీటీ) గవర్నర్స్‌ సదస్సుకు ఆయన సారథ్యం వహించనున్నారు. 24న జరిగే ఈ సదస్సులో ఏటీటీ రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, అమలు చేయతగిన సంస్కరణలు తదితర అంశాలపై చర్చిస్తారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు చైర్‌గా వ్యవహరించే అవకాశం ఒక భారతీయుడికి దక్కడం ఇదే ప్రథమం. జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ గ్రంధి కిరణ్‌ కుమార్‌తో పాటు లుఫ్తాన్సా చైర్మన్‌ కార్‌స్టెన్‌ స్పోర్, మారియట్‌ ఇంటర్నేషనల్‌ అర్నె సోరెన్సన్‌ తదితరులు ఈ సదస్సులో పాల్గొంటారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top