కరోనా ప్రభావం: ఆర్‌బీఐ కీలక నిర్ణయం

RBI cuts repo rate 75 bps point - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు కొనసాగుతున్న నేపథ్యంలో  రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక మైన రెపో రేటును 75 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. అలాగే అన్ని రకాల లోన్లుపై 3 నెలలు మారిటోరియం ప్రకటించింది. శుక్రవారం గవర్నరు శక్తికాంత దాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్థిక సుస్థిరత ఉండేలా చర్యలు చేపట్టామని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ఆయన తెలిపారు. వచ్చే మూడు నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదని, ఇప్పుడు కట్టాల్సిన లోన్లు తర్వాత కట్టుకునే వెసులుబాటు ఉందన్నారు. దీనివల్ల రుణాలు తీసుకున్న వారి  సిబిల్‌ స్కోర్‌పై ప్రభావం ఉండదని గవర్నర్‌ హామీ ఇచ్చారు.
 
కరోనా వైరస్, లాక్ డౌన్ లాంటి  అనివార్య  పరిస్థితుల మధ్య మీడియాతో మాట్లాడాల్సి వచ్చిందని గవర్నర్‌ శక్తికాంత దాస్ వెల్లడించారు. భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ సురక్షితంగా ఉందన్న ఆయన ప్రస్తుతం మనం ఓ అసాధారణ ముప్పు ఎదుర్కొంటున్నామని, కరోనా వైరస్‌పై విజయం సాధించాలంటే యుద్ధం తరహాలో పోరాడాలన్నారు. కఠినమైన పరిస్థితులు ఎప్పుడూ కొనసాగవని, ఆర్థిక సుస్థిరతకు ఊతమిచ్చే చర్యలు తీసుకునే సమయమని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం మంచి చేసిందన్నారు. ఒకేసారి షేర్లు అమ్ముకోవడం వల్ల మార్కెట్లకు నష్టాలు వచ్చాయన్నారు. 

ఏప్రిల్  మాసంలో ప్రకటించాల్సిన పరపతి విధాన నిర్ణయాన్ని ముందుకు తీసుకొచ్చామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే  మార్చి 24, 26, 27 తేదీలలో సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ స్థూల ఆర్థిక , సూక్ష్మ ఆర్థిక పరిస్థితులపై చర్చించిందని  తెలిపారు. దీని ప్రకారం రెపో రేటు 75 పాయింట్ల మేర కోత విధింపునకు ఎంపీసీ నిర్ణయించినట్టు చెప్పారు. దీంతో ప్రస్తుత రెపో రేటు 4.40 శాతానికి దిగి వచ్చింది. 90 బీపీఎస్ పాయింట్ల  కోతతో రివర్స్ రెపో రేటు 4 శాతంగా ఉండనుంది. తద్వారా ప్రపంచ కేంద్ర బ్యాంకుల బాటలో నడిచిన ఆర్‌బీఐ ముందస్తు  రేట్ కట్ ను ప్రకటించింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top