డిస్కవర్‌ 100 సీసీ ఘోర తప్పిదం..

Rajiv bajaj Comments On Bajaj Discover CC100 Bike - Sakshi

దానివల్లే రెండో స్థానంలో ఉండిపోయాం

బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ వ్యాఖ్య  

ముంబై: మోటార్‌సైకిల్‌ శ్రేణి డిస్కవర్‌లో 100 సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టడం తన కెరియర్‌లో ఘోర తప్పిదమని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ వ్యాఖ్యానించారు. దీనితో తమ సంస్థ దేశీ ద్విచక్రవాహనాల మార్కెట్లో నంబర్‌– 2 స్థానానికి పరిమితమైపోయిందని చెప్పారాయన. ఒకవేళ 100 సీసీని ప్రవేశపెట్టకుండా ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవన్నారు. ‘‘డిస్కవర్‌లో 125సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ఇటు మైలేజీతో పాటు అటు అధిక సామర్థ్యంతో పనిచేసే బైక్‌గా ప్రత్యేకత ఉండేది. గణనీయంగా పెరిగిన అమ్మకాలే ఇందుకు నిదర్శనం. ఆ తర్వాత అత్యాశకు పోయాం. 125 సీసీ డిస్కవర్‌ బైకులు ఇంత భారీగా అమ్ముడవుతున్నాయంటే.. ఇక 100 సీసీ బైక్‌లు ఇంకా భారీగా అమ్ముడవుతాయంటూ మా మార్కెటింగ్‌ సిబ్బంది అభిప్రాయపడ్డారు. దీంతో 100 సీసీ వేరియంట్‌ను ప్రవేశపెట్టాం. అంతే... మా ప్రత్యేకత పోయింది. అయిదేళ్ల తర్వాత మా పనితీరు కూడా దెబ్బతింది. విభిన్నంగా ఉండాలనే ప్రయత్నంతో డిస్కవర్‌ 125 సీసీని తీసుకొచ్చాం. కానీ ఆ తర్వాత మూసధోరణిలోకి పోయాం. ఈ మూసధోరణి అనేది జీవితంలోనైనా, మార్కెటింగ్‌లోనైనా చాలా చెడ్డది‘ అని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజీవ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. అప్పుడెప్పుడో చేసిన తప్పిదానికి తమ కంపెనీ ఇప్పటికీ రెండో స్థానానికే (బైక్‌ల అమ్మకాల పరిమాణం పరంగా) పరిమితమైపోవాల్సి వస్తోందని ఆయన తెలిపారు.  

ఆశావహంగా కేటీఎం..
తాము ఇన్వెస్ట్‌ చేసిన ఆస్ట్రియన్‌ రేసింగ్‌ బైక్‌ల తయారీ సంస్థ కేటీఎం అవకాశాలు ఆశావహంగా ఉన్నాయని రాజీవ్‌ బజాజ్‌ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. 2007లో తాము ఇన్వెస్ట్‌ చేసినప్పుడు కేటీఎం ఏటా 65,000 బైక్‌లు మాత్రమే తయారు చేసేదని, అయినప్పటికీ యూరప్‌లో రెండో అతి పెద్ద మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌గా ఉండేదని ఆయన తెలియజేశారు. ‘‘అప్పట్లో మరో దిగ్గజ సంస్థ హార్లే డేవిడ్‌సన్‌ ఏడాదికి 3.5 లక్షల బైకులు తయారు చేసేది. అయితే, గత కొన్నాళ్లుగా హార్లే ప్రభావం క్రమంగా తగ్గుతోంది. ఈ ఏడాది 2.4 లక్షల వాహనాలే తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. కేటీఎం మాత్రం అంతకు మించి 2.7 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయనుంది’’ అని ఆయన వివరించారు. వచ్చే ఏడాది ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలోకి ప్రవేశించనున్నట్లు రాజీవ్‌ బజాజ్‌ చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top