‘మందగమనానికి రాజన్‌ మందు’

Raghuram Rajan Has Called For Reforms To Liberalise Capital And Labour Markets - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని కార్యాలయంలో అధికారం కేంద్రీకృతం కావడం ద్వారా దేశంలో ఆర్థిక వృద్ధి మందగమనం కొనసాగుతోందని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. మూలధనం, భూమి, కార్మిక మార్కెట్లు, పెట్టుబడులు, వృద్ధిని సరళీకరించేలా సంస్కరణలు అవసరమని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. పోటీతత్వాన్ని పెంపొందించడం, దేశీయ సమర్ధతను మెరుగుపరిచేందుకు భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో చేరాలని కోరారు. ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో తప్పు ఎక్కడ జరుగుతుందనే దాన్ని ముందుగా మనం అర్ధం చేసుకోవాలని, ప్రస్తుత ప్రభుత్వంలో అధికార కేంద్రీకరణ గురించి ప్రస్తావించాలని వ్యాఖ్యానించారు.

నిర్ణాయక వ్యవస్థలోనే కాదు సలహాలు ప్రణాళికలు సైతం ప్రధాని చుట్టూ, ప్రధాని కార్యాలయంలో చేరిన కొద్ది మంది నుంచే వస్తున్నాయని రాజన్‌ స్పష్టం చేశారు. ఇది పార్టీ రాజకీయ, సామాజిక అజెండాకు ఉపకరిస్తున్నా ఆర్థిక సంస్కరణల విషయంలో ఫలితాలను ఇవ్వడం లేదని పెదవివిరిచారు. రాష్ట్రస్ధాయిలో కాకుండా దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై వీరికి పెద్దగా అవగాహన ఉండటం లేదని అన్నారు. గత ప్రభుత్వాలు సంకీర్ణ సర్కార్‌లు అయినా తదుపరి ఆర్థిక సరళీకరణను స్ధిరంగా ముందుకు తీసుకువెళ్లాయని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం కనిష్ట ప్రభుత్వం..గరిష్ట పాలన నినాదంతో అధికారంలోకి వచ్చినా దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్‌ ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన తొలి చర్య దాన్ని అర్థం చేసుకోవడమేనని చెప్పుకొచ్చారు. ప్రతి విమర్శకులకూ రాజకీయ దురుద్దేశం అంటగట్టడం సరికాదని, మందగమనం తాత్కాలికమనే భావనను విడనాడాలని రఘురాం​ రాజన్‌ హితవుపలికారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top