
ఆదాయం లేదు.. రిటర్న్ వేయలా?
నేనొక సీనియర్ సిటిజన్‌ను. పన్ను చెల్లించేంత ఆదాయం నేను ఆర్జించడం లేదు.
నేనొక సీనియర్ సిటిజన్‌ను. పన్ను చెల్లించేంత ఆదాయం నేను ఆర్జించడం లేదు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విక్రయం ద్వారా రూ.3.20 లక్షల దీర్ఘకాల మూలధన లాభాలు వచ్చాయి. మూలధన లాభాలు రూ.3 లక్షలు మించినందున నేను ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలా? - నారాయణరావు, విజయవాడ
రూ.3 లక్షల ఆదాయన్ని మించి ఆర్జించినట్లయితే సీనియర్ సిటిజన్‌లు ట్యాక్స్ రిటర్న్‌లు సమర్పించాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విక్రయం ద్వారా మీకు రూ.3.2 లక్షల దీర్ఘకాల మూలధన లాభాలు వచ్చాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఏమీ లేదు. అందుకని మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అయినప్పటికీ మీరు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తేనే మంచిది. మీరు ఐటీఆర్-2 రిటర్న్‌ను సమర్పిస్తే సరిపోతుంది.
నేను ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్-పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్)లో 2012, జూలై నుంచి పెట్టుబడులు పెడుతున్నాను. ఐదేళ్ల పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లో 2014 అక్టోబర్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ పెట్టుబడులపై నాకు ఎంత వడ్డీ వస్తుంది? నేను పెట్టుబడులు పెట్టినప్పటి నుంచి వడ్డీ లెక్కిస్తారా ? లేకుంటే 2016లో సవరించిన వడ్డీరేట్లు చొప్పున లెక్కిస్తారా ? - నవీన, హైదరాబాద్
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్-పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్) వడ్డీరేట్లను ప్రతి మూడు నెలలకొకసారి సవరిస్తున్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్‌లకు అనుగుణంగా ఈ సవరింపు ఉంటుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి (ఏప్రిల్-జూన్, 2016) వడ్డీరేట్లు 8.10 శాతం(ఏడాదికి)గా ఉంది. మీరు 2012 నుంచి పెట్టుబడి చేస్తున్నారు, కనుక ఈ ఏడాది మార్చి వరకూ అప్పటి వడ్డీ రేట్లను మీరు పొందివుంటారు. అలా వడ్డీ, అసలు కలిపి మీ ఖాతాలో వున్న మొత్తంపై తాజాగా సవరించిన వడ్డీ రేటు ప్రకారం మీకు వడ్డీ వస్తుంది. ఇక పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ విషయానికొస్తే, మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంత రేటు ఉందో అంతే వడ్డీరేటు వర్తిస్తుంది. ఆర్‌డీ రేట్లలో వచ్చే మూడు నెలల వారీ మార్పులు మీ ప్రస్తుత ఆర్‌డీ ఖాతాపై ఎలాంటి ప్రభావం చూపవు.
నేను గత ఏడాది జూలై నుంచి ఎస్‌బీఐ లైఫ్ స్మార్ట్ వెల్త్ బిల్డర్ ప్లాన్‌కు సంబంధించి రెండు పాలసీలు తీసుకున్నాను. ఒకో దానికి రూ.3 లక్షలు చొప్పున మొత్తం ఆరు లక్షలు ప్రీమియమ్‌గా చెల్లించాను. ఈ ప్లాన్ విలువ ఇప్పుడు తగ్గిపోయింది. ఈ ప్లాన్‌కు ఐదేళ్ల పాటు ప్రీమియమ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ కొనసాగించాలనుకోవడం లేదు. అందుకు గాను రూ.12,000 జరిమానా భరించడానికి సిద్ధంగానే ఉన్నాను. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. - కిశోర్, విశాఖపట్టణం
ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ స్మార్ట్ వెల్త్ బిల్డర్ పేరుతో సంప్రదాయ యులిప్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ తరహా ప్లాన్‌ల్లో మీరు చెల్లించే ప్రీమియమ్‌ల నుంచి మొరాలిటీ చార్జీలను, నిర్వహణ వ్యయాలను, ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఈ చార్జీల భారం కారణంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో తరుగు ఏర్పడుతుంది. అందువల్ల మార్కెట్ పనితీరు బాగా ఉన్నప్పటికీ, మీకు తక్కువ స్థాయిలోనే రిటర్న్‌లు వస్తాయి. కమిషన్ అధికంగా వస్తున్నందున ఏజెంట్లు ఈ ప్లాన్‌లను విక్రయించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. లేనిపోని ఆశలు కల్పిస్తారు.
అందుకని ఏ పాలసీ తీసుకునేముందైనా ఆ పాలసీ బ్రోచర్‌ను, సంబంధిత డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇక ఈ పాలసీకు లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. ఈ పాలసీలను మీరు ఇప్పుడు సరెండర్ చేసినట్లయితే, ఈ ఫండ్ విలువ మొత్తాన్ని డిస్‌కంటిన్యూడ్ పాలసీ ఫండ్‌కు బదిలీ చేస్తారు. డిస్‌కంటిన్యూయస్ చార్జీ(ఫండ్ విలువలో 1% కంటే తక్కువగానూ, గరిష్టంగా రూ.6,000) మినహాయించుకుంటారు. ఐదు పాలసీ సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే మీకు ఈ సొమ్ము అందుతుంది.
బీమాకు, ఇన్వెస్ట్‌మెంట్స్ కలగలపి ఈ తరహా ప్లాన్‌ల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకండి. జీవిత బీమాకోసం ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్ తీసుకోండి. వీటి ప్రీమియమ్‌లు చౌకగా ఉంటాయి. తగిన బీమాను ఇస్తాయి. ఇక ఇల్లు కొనడం, పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, తదితర దీర్ఘకాల లక్ష్యాలకు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందుతారు.
నేను బీఎస్‌ఎల్ ఎంపవర్ పెన్షన్ ప్లాన్‌ను 2013 డిసెంబర్‌లో తీసుకున్నాను. ఏడాదికి రూ.2.5 లక్షల చొప్పున మూడేళ్ల పాటు ప్రీమియమ్‌లు చెల్లించాను. ఐదేళ్ల తర్వాత ఈ పాలసీని సరెండర్ చేయాలనుకుంటున్నాను. ఈ పాలసీ సరెండర్ చేసినప్పుడు నాకు వచ్చే సరెండర్ విలువపై నేనేమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా ? - రాజగోపాల్, రాజమండ్రి
బిర్లా సన్ లైఫ్ ఎంపవర్ పెన్షన్ ప్లాన్ అనేది యూనిట్ లింక్‌డ్ పెన్షన్ ప్లాన్(యూఎల్‌పీపీ) ఐదేళ్ల తర్వాత మీరు ఈ ప్లాన్‌ను సరెండర్ చేయవచ్చు. మీరు సరెండర్ చేసేటప్పుడు సదరు ఫండ్ విలువ ఎంత ఉంటుందో, అదే మీకు సరెండర్ విలువగా లభిస్తుంది. మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఈ సరెండర్ వేల్యూపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.