‘అల్‌ఫలా’ ఒక చీకటి సామ్రాజ్యం.. ఈడీ దర్యాప్తులో వెల్లడి | Fraud Forgery And More Al Falah University | Sakshi
Sakshi News home page

‘అల్‌ఫలా’ ఒక చీకటి సామ్రాజ్యం.. ఈడీ దర్యాప్తులో వెల్లడి

Nov 19 2025 11:01 AM | Updated on Nov 19 2025 11:15 AM

Fraud Forgery And More Al Falah University

ఫరీదాబాద్‌: హర్యానాలోని ఫరీదాబాద్‌లోగల అల్‌ఫలా ఛారిటబుల్ ట్రస్ట్, దాని అనుబంధ సంస్థలు తప్పుడు గుర్తింపుతో భారీగా నిధులను కొల్లగొట్టాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొంది. అక్రెడిటేషన్ లేకుండానే విశ్వవిద్యాలయం విద్యార్థుల నుండి పూర్తి ఫీజులు వసూలు చేసిందని, ఫోర్జరీకి పాల్పడిందని ఈడీ దర్యాప్తులో తేలింది.

తప్పుడు ఆధారాలతో 2018-19 నుండి 2024-25 వరకు  ఏడు సంవత్సరాల కాలంలో ట్రస్ట్‌ రూ. 415 కోట్ల అక్రమ ఆదాయాన్ని ఆర్జించినట్లు ఈడీ కోర్టుకు నివేదించింది. ఢిల్లీ పేలుడు దర్యాప్తు సమయంలో  ‘అల్‌ఫలా’ అక్రమాలు బయటపడ్డాయి. ఈ నేపధ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ‘అల్‌ఫలా’పై దర్యాప్తు జరుగుతోంది.ఈ కుంభకోణంలో ప్రధాన నిందితునిగా ఉన్న ‘అల్‌ఫలా’ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ జావాద్ అహ్మద్ సిద్ధిఖీని ఈడీ అరెస్టు చేసింది. తరువాత డిసెంబర్ ఒకటి వరకు కస్టడీకి పంపింది. పీఎంఎల్‌ఏ దర్యాప్తులో భాగంగా ఈ సంస్థల బ్యాంక్ ఖాతాలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లు అన్నీ ఒకే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) కింద నమోదయ్యాయని ఈడీ అధికారులు కనుగొన్నారు.

యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణల ప్రకారం తప్పుడు అక్రిడిటేషన్ ఉపయోగించి విద్యార్థులను చేర్చుకోవడం, నకిలీ పత్రాలను తయారు చేయడం  తదితర పద్ధతుల ద్వారా వర్శిటీ అక్రమంగా ఆదాయం సంపాదించింది. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను ట్రస్ట్ కార్యకలాపాలకు కాకుండా వ్యక్తిగత, ప్రైవేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించిందని చూపించే బలమైన ఆధారాలు లభించాయని ఈడీ తెలిపింది. యూనివర్సిటీ ఛాన్సలర్ కూడా  జావాద్ సిద్ధిఖీయే అన్ని ప్రధాన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నారని విచారణలో వెల్లడైంది.

అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయానికి ఉగ్రవాద సంబంధాలు కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి దర్యాప్తులో ఉన్న పలువురు ఉగ్రవాద అనుమానితులకు ఈ విశ్వవిద్యాలయం కేంద్రంగా ఉంది. పేలుడుకు పాల్పడిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అలియాస్ డాక్టర్ ఉమర్ ఉన్ నయీబ్, అతని సహచరులు షాహీన్ సయీద్, ముజమ్మిల్ షకీల్, ఆదిల్ రాథర్‌లు ‘అల్‌ఫలా’లో పనిచేశారు. వీరు పేలుడు పదార్థం కోసం విశ్వవిద్యాలయ ప్రయోగశాల నుండి రసాయనాలను అక్రమంగా తరలించారనే ఆరోపణలున్నాయి.

ఇది కూడా చదవండి: ఢిల్లీ బాంబర్ ప్లాన్: పుల్వామాలోని తన ఇంటికి వెళ్లి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement