రూ.2,450 కోట్లు లూఠీ : బ్యాంకు స్టాఫర్లే.. | Public Sector Banks Lost Rs 2450 Crore To Frauds Involving Staff | Sakshi
Sakshi News home page

రూ.2,450 కోట్లు లూఠీ : బ్యాంకు స్టాఫర్లే..

Mar 2 2018 7:39 PM | Updated on Jul 29 2019 6:54 PM

Public Sector Banks Lost Rs 2450 Crore To Frauds Involving Staff - Sakshi

బెంగళూరు : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పీఎన్‌బీ స్కాం మాదిరిగానే బ్యాంకుల్లో మోసాలు భారీగానే జరుగుతున్నాయని వెల్లడైంది. ఈ మోసాల్లో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయమే ఎక్కువగానే ఉంటుందని తెలిసింది. రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా డేటాలో  ఈ విషయం తెల్లతేటమైంది. 2013 ఏప్రిల్‌ నుంచి 2016 జూన్‌ వరకున్న డేటాలో బ్యాంకుల్లో రూ.2,450 కోట్ల మేర అక్రమాలు జరిగాయని, ఇవి ఎక్కువగా ఉద్యోగుల సహకారంతోనే జరిగినట్టు తెలిసింది.  

వీటిల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి 49 శాతం కేసులు నమోదయ్యాయని, కానీ మొత్తం రూ.462 కోట్ల నగదునే కోల్పోయినట్టు ఆర్‌బీఐ డేటా పేర్కొంది. అయితే మొత్తం కేసుల్లో చాలా తక్కువగా 3 శాతం మాత్రమే నమోదైన రాజస్తాన్‌లో, భారీగా రూ.1,096 కోట్ల నగదును బ్యాంకులు పోగొట్టుకున్నట్టు తెలిపింది. బ్యాంకు ఉద్యోగుల ప్రమేయముండే ఇలాంటి మోసపూరిత కేసులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్రల్లో ఎక్కువగా నమోదవుతున్నాయని, అదేవిధంగా రాజస్తాన్‌, ఛండీగర్‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో కూడా బాగానే నగదు లూటీ అవుతుందని తెలిసింది. 

లక్ష, ఆపై మొత్తాల మోసాల కేసుల్లో బయట వ్యక్తులు, బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సాయంతో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆర్‌బీఐ డేటా పేర్కొంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఇలాంటి కేసులు నమోదవడానికి కారణం, ఆ రాష్ట్రాల్లో బ్యాంకు బ్రాంచులు అధికంగా ఉన్నాయని ఓ బ్యాంకు మేనేజర్‌ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అ‍త్యధికంగా బ్యాంకు బ్రాంచులున్నట్టు పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు ప్రమేయముండే ఈ మోసాలను అసలు ఉపేక్షించేది లేదని కూడా తేల్చి చెప్పారు. 

బ్యాంకు మోసాలు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో 170 కేసులతో తమిళనాడు  తొలి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ 157 కేసులతో రెండో స్థానంలో ఉంది. అనంతరం కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, రాజస్తాన్‌, ఛండీగర్‌, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement