పీఎన్‌బీ లాభం రూ.561 కోట్లు | PNB profit is Rs 561 crore | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ లాభం రూ.561 కోట్లు

Nov 4 2017 12:15 AM | Updated on Nov 4 2017 12:15 AM

PNB profit is Rs 561 crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజాల్లో ఒకటైన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నికర లాభం  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ క్వార్టర్లో స్వల్పంగా పెరిగింది. గత క్యూ2లో రూ.549 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 2 శాతం వృద్ధితో రూ.561 కోట్లకు చేరుకున్నట్లు పీఎన్‌బీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.13,639 కోట్ల నుంచి రూ.14,205 కోట్లకు ఎగిసిందని పీఎన్‌బీ సీఎండీ సునీల్‌ మెహతా చెప్పారు. నిర్వహణ లాభం రూ.2,732 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.3,279 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

తగ్గుతున్న మొండి బకాయిలు
గత క్యూ2లో రూ.57,630 కోట్లుగా(13.63%)  ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.56,466 కోట్లకు(13.31%) తగ్గాయని, అలాగే నికర  మొండి బకాయిలు రూ.35,722 కోట్ల(9.10%) నుంచి రూ.34,570 కోట్లకు(8.44%) తగ్గాయని మెహతా తెలిపారు.  గత క్యూ2లో రూ.11,000 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ2లో 8,000 కోట్లకు తగ్గాయని వివరించారు.

అయితే మొండి బకాయిలకు  కేటాయింపులు మాత్రం రూ.1,954 కోట్ల నుంచి రూ.2,694  కోట్లకు పెరిగాయని వివరించారు. మూలధన నిధులు పుష్కలంగా ఉన్నాయని, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా కీలకం కాని ఆస్తులను (పీఎన్‌బీ హౌసింగ్‌ వంటి సంస్థల్లో వాటాల) విక్రయిస్తామని మెహతా పేర్కొన్నారు. దేశీయ రుణాలు రూ.3.61 లక్షల కోట్ల నుంచి ఈ క్యూ2లో 8 శాతం వృద్ధితో రూ.3.91 లక్షల కోట్లకు పెరిగాయనిపేర్కొన్నారు. ఫలితాలు అంచనాలు మించడంతో షేర్‌ బీఎస్‌ఈలో 5% ఎగసి రూ.207  వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement