భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయండి

PN Narendra Modi invites foreign investors - Sakshi

పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు

అపార వ్యాపార అవకాశాలు

అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ: వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్న భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆసియాలోనే అతి పెద్ద ఎకానమీ అయిన భారత్‌లో పెట్టుబడులకు, వ్యాపారాల నిర్వహణకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇండియా గ్లోబల్‌ వీక్‌ 2020 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ‘స్వేచ్ఛా వాణిజ్యానికి అత్యంత అనువైన ఎకానమీల్లో భారత్‌ ఒకటి.

భారత్‌లోనూ కార్యకలాపాలు విస్తరించేలా అంతర్జాతీయ కంపెనీలకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నాం. ప్రస్తుతం భారత్‌లో ఉన్నటువంటి అవకాశాలు చాలా తక్కువ దేశాల్లో మాత్రమే ఉన్నాయి‘ అని మోదీ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కట్టడిపరమైన లాక్‌డౌన్‌ నుంచి క్రమంగా బైటపడుతున్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నంత మాత్రాన ప్రపంచంతో సంబంధాలను తెంచుకున్నట్లు కాదని ప్రధాని స్పష్టం చేశారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ ప్రపంచ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.  

సంస్కరణల బాట..
పెట్టుబడులను ఆకర్షించే దిశగా స్పేస్, రక్షణ తదితర రంగాలన్నింటిలో ఇటీవల ప్రవేశపెట్టిన పలు సంస్కరణల గురించి ప్రధాని వివరించారు. ‘ఎకానమీలో ఉత్పాదకత, పోటీతత్వం మరింత పెరిగేలా పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు నెలకొనేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పలు రంగాల్లో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో సంస్కరణలతో స్టోరేజీ, లాజిస్టిక్స్‌ వంటి విభాగాల్లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు‘ అని ఆయన చెప్పారు. అలాగే పెద్ద పరిశ్రమలకు తోడుగా ఉండేలా చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) రంగంలోనూ సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు ప్రధాని వివరించారు. స్పేస్, రక్షణ రంగాలకు అవసరమయ్యే పరికరాల తయారీకి సంబంధించి కొన్ని విభాగాల్లో ప్రైవేట్‌ సంస్థలకు కూడా అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆయా రంగాల్లోనూ ఇన్వెస్ట్‌ చేయడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని మోదీ చెప్పారు.

దేశీ ఫార్మా సత్తా చాటుతోంది..
కరోనా వైరస్‌ మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో భారతీయ ఫార్మా పరిశ్రమ కేవలం దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఎంతో విలువైన సంపద అన్న విషయం మరోసారి రుజువైందని ప్రధాని చెప్పారు. ‘ఔషధాల ధరలు దిగి వచ్చేలా చేయడంలో .. ముఖ్యంగా వర్ధమాన దేశాలకు తోడ్పడటంలో భారతీయ ఫార్మా కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోని మూడింట రెండొంతుల మంది బాలల వ్యాక్సినేషన్‌కు భారత్‌లో తయారైన టీకాలనే ఉపయోగిస్తున్నారు.

కరోనా వైరస్‌కి సంబంధించిన టీకా రూపకల్పన, తయారీలో కూడా దేశీ ఫార్మా సంస్థలు చురుగ్గా పాలుపంచుకుంటున్నాయి. టీకా కనుగొన్న తర్వాత దాన్ని అభివృద్ధి చేయడంలోనూ, వేగంగా తయారీని పెంచడంలో భారత్‌ కచ్చితంగా కీలకపాత్ర పోషించగలదని విశ్వసిస్తున్నా‘ అని మోదీ తెలిపారు. ప్రపంచ సంక్షేమానికి, అభివృద్ధికి భారత్‌ శాయశక్తులా కృషి చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. సంస్కరణలు చేపడుతూ, ఆచరణలోనూ చూపిస్తూ, రూపాంత రం చెందుతున్న భారత్‌ కొంగొత్త వ్యాపార అవకాశాలు కల్పిస్తోందని ప్రధాని చెప్పారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top