పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు 23 నుంచి | Sakshi
Sakshi News home page

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు 23 నుంచి

Published Thu, May 18 2017 4:14 AM

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు 23 నుంచి

న్యూఢిల్లీ: పేమెంట్స్‌ బ్యాంకు సేవల లైసెన్స్‌ పొందిన పేటీఎం తన కార్యకలాపాలను ఈ నెల 23 నుంచి ప్రారంభించనుంది. ఆర్‌బీఐ నుంచి తుది లైసెన్స్‌ లభించిందని, ఈ నెల 23 నుంచి సేవలను ప్రారంభిస్తున్నామని పేటీఎం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. పేటీఎం వ్యాలెట్‌కు ప్రస్తుతం 21.8 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ వ్యాలెట్లన్నీ ఈ నెల 23 తర్వాత పేమెంట్స్‌ బ్యాంకుకు బదిలీ అవుతాయి. ఇది ఇష్టం లేని వారు ఆ విషయాన్ని 23వ తేదీలోపే తెలియజేయాల్సి ఉంటుంది.

 అప్పుడు యూజర్‌ వ్యాలెట్‌లో ఉన్న నగదును వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. ఒకవేళ సంబంధిత వ్యాలెట్‌ గత ఆరు నెలలుగా ఏ విధమైన లావాదేవీలు లేకుంటే, కస్టమర్‌ ఆమోదం తర్వాతే వ్యాలెట్‌ను పేమెంట్స్‌ బ్యాంకుకు బదిలీ చేస్తారు. పేటీఏం పేమెంట్స్‌ బ్యాంకు ఏర్పాటుకు విజయ్‌ శేఖర్‌శర్మ(పేటీఎం మాతృసంస్థ వన్‌97  వ్యవస్థాపకుడు)కు ఆర్‌బీఐ 2015లో సూత్రపాత్ర ఆమోదం తెలియజేసింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకులో మెజారిటీ వాటా విజయ్‌శేఖర్‌ శర్మ చేతిలో ఉండగా, మిగిలింది చైనా సంస్థ అలీబాబా గ్రూపునకు ఉంది. కాగా, పేటీఎం కొత్త సీఈవోగా రేణుసత్తిని నియమించినట్టు పేటీఎం తెలిపింది.

త్వరలో ఆదిత్య బిర్లా...: ఆర్థిక సేవలను మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతో ఆర్‌బీఐ చిన్న ఫైనాన్స్‌ బ్యాంకు, పేమెంట్స్‌ బ్యాంకుల పేరుతో కొత్త అవకాశాలకు వీలు కల్పించింది. మొత్తం 21 సంస్థలకు ఆర్‌బీఐ గతేడాది సూత్రప్రాయ ఆమోదం తెలియజేయగా... వాటిలో 11 పేమెంట్స్‌ బ్యాంకులకు చెందినవి ఉన్నాయి.  ప్రస్తుతానికి ఎయిర్‌టెల్, ఇండియా పోస్ట్‌ మాత్రమే పేమెంట్స్‌ బ్యాంకులను ఆరంభించగా, త్వరలో ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంకు రంగ ప్రవేశం చేయనుంది.

Advertisement
Advertisement