సాధారణంగా మధ్యతరగతివారికి డిస్కౌంట్లు అంటే మోజు ఎక్కువ. ఎక్కడ ఏది కొనాలన్నా మొదట డిస్కౌంట్ ఎంత వస్తుందా అని ఆలోచిస్తారు. కానీ సంపన్నులు కూడా వీటికి అతీతులు కాదని కొందరు నిరూపిస్తున్నారు.
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తాజాగా ఓ రెస్టారెంట్ బిల్లుపై భారీ తగ్గింపు పొందిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కాస్త వైరల్‌గా మారి ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. బిలియనీర్లు కూడా డిస్కౌంట్‌ల కోసం చూస్తారనే అంశంపై నెటిజన్లు చమత్కారాలు చేయడం మొదలుపెట్టారు.
ఢిల్లీ విమానాశ్రయంలోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ఉన్న ది గ్రేట్ కబాబ్ ఫ్యాక్టరీలో స్నేహితులతో కలిసి పుట్టినరోజు విందు జరుపుకొన్న విజయ్ శేఖర్ శర్మ.. డిన్నర్ బిల్లు రూ. 40,828 వచ్చినట్లు తెలిపారు. అయితే ఈజీడైనర్‌లోని ఆఫర్లు, కూపన్లు ఉపయోగించి బిల్లును రూ. 24,733కి తగ్గించగలిగారు. మొత్తం రూ. 16,095 ఆదా కావడం ఆయనను ఆశ్చర్యపరచింది.
ఈ బిల్లు స్క్రీన్‌షాట్‌ను తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన “ఇది ఊహించని పుట్టినరోజు గిఫ్ట్‌లా అనిపించింది” అంటూ ఈజీడైనర్, దాని వ్యవస్థాపకుడు కపిల్ చోప్రాకు ధన్యవాదాలు తెలిపారు. 35% రెస్టారెంట్ డిస్కౌంట్ రూ. 14,290 తో పాటు రూ. 2,000 అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కూపన్ కూడా వర్తించడంతో ఈ భారీ తగ్గింపు వచ్చింది.
నెటిజన్ల స్పందనలు
విజయ్ శేఖర్ శర్మ పోస్ట్ వైరల్ కావడంతో, డిస్కౌంట్‌ను ఆయన వాడుకోవడంపై సోషల్ మీడియా యూజర్లు జోకులు పేలుస్తున్నారు. “మాకు కూడా ‘కపిల్ చోప్రా లాంటి స్నేహితులు’ ఉంటే బాగుండేది” అని కొందరు సరదాగా చెప్పారు. “బిలియనీర్లు డిస్కౌంట్ చూసి ఇలా ఎంజాయ్ చేస్తే… మనం మాత్రం రెస్టారెంట్లలో రూ. 20 సర్వీస్ ఛార్జీ కోసం వాగ్వాదం చేస్తాం” అని మరో కామెంట్ వైరల్ అయింది. “పేటీఎం క్యాష్‌బ్యాక్ కర్మ తిరిగి వస్తోంది” అని ఒకరు వ్యాఖ్యానించారు. “మీరు బిలియనీర్ కాదా? బిలియనీర్లు కూడా డిస్కౌంట్లను ఇష్టపడతారా?” అంటూ మరొకరు ప్రశ్నించారు.
It is too good to be true that a ₹40k restaurant bill becomes ₹24 k just because you have friend like @KapilChopra72 ‘s awesome and incredible @eazydiner ! 😄
Thank you EazyDiner , it is always awesome discounts on food 🤗🙏🏼 pic.twitter.com/XthhbM4NXM— Vijay Shekhar Sharma (@vijayshekhar) November 22, 2025


