ఇక పేటీఎమ్‌ బ్రోకింగ్‌ సేవలు..

Paytm Broking Services Soon - Sakshi

అనుమతించిన సెబీ  

మాకు పోటీ పేటీఎమ్‌ మాత్రమే: జీరోధా సీఈఓ నితిన్‌ కామత్‌

ముంబై: షేర్‌ బ్రోకింగ్‌ సర్వీసులు ప్రారంభించడానికి పేటీఎమ్‌ మనీ సంస్థకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ అనుమతినిచ్చింది. గత వారమే సెబీ నుంచి ఆమోదం పొందామని పేటీఎమ్‌ మనీ పేర్కొంది. వీలైనంత త్వరగా ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని పేటీఎమ్‌ మనీ తెలిపింది. వినియోగదారులు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇప్పటికే పేటీఎమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం వీలు కల్పిస్తోందని పేర్కొంది. ఆరంభమైన కొద్ది నెలల్లోనే తమ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌ను పది లక్షల మంది యూజర్లు వినియోగించుకున్నారని  వివరించింది. 

పోటీ మరింత పెరుగుతుందా ?  
ఇప్పటికే జీరోధా సంస్థ డిస్కౌంట్‌ ధరలకే షేర్‌ బ్రోకింగ్‌ సేవలందిస్తోంది. షేర్‌ బ్రోకింగ్‌ సర్వీసుల విషయంలో అనతికాలంలోనే మార్కెట్‌ లీడర్‌గా ఎదిగిన జీరోధా నుంచి ఎదురవుతున్న గట్టి పోటీని తట్టుకోవడానికి ఇటీవలనే యాక్సిస్‌ డైరెక్ట్, ఏంజెల్‌ బ్రోకింగ్‌ సంస్థలు డిస్కౌంట్‌ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా పేటీఎమ్‌ మనీ కూడా ఈ రంగంలోకి వస్తుండటంతో పోటీ తీవ్రత మరింతగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మాకు పోటీనిచ్చేది పేటీఎమ్‌ మనీయేప్రస్తుత పరిస్థితుల్లో తమకు పోటీనిచ్చేది పేటీఎమ్‌ మాత్రమేనని జీరోధా సీఈఓ నితిన్‌ కామత్‌ వ్యాఖ్యానించారు.  ప్రస్తుతానికైతే, తమకు పోటీనిచ్చే సత్తా పేటీఎమ్‌కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. అయితే పేటీఎమ్‌ తమకు తగిన పోటీనిస్తుందో లేదో కాలమే నిర్ణయిస్తుందని వివరించారు. టెక్నాలజీ పరంగా తాము పటిష్టంగా ఉన్నామని, ఈ విషయంలో తమకు ఎదురే లేదని, ఏ కొత్త కంపెనీ కూడా తమకు పోటీనివ్వడం జరిగే పని కాదని నితిన్‌ కామత్‌  పేర్కొన్నారు. 2010లో కార్యకలాపాలు ప్రారంభించిన జీరోధాకు ప్రస్తుతం 8.47 లక్షల క్లయింట్లున్నారు. భారత్‌లో అగ్రశ్రేణి డిస్కౌంట్‌ బ్రోకింగ్‌ సంస్థ ఇదే. డెలివరీ సంబంధిత ఈక్విటీ లావాదేవీలకు జీరోధా ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. ఈక్విటీ ఆప్షన్స్‌  లావాదేవీలకు ఒక్కో లావాదేవీకి రూ.20 మాత్రమే చార్జ్‌ చేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top