ఎన్‌సీఎల్‌టీలో పతంజలి పిటిషన్‌ | Patanjali objects to lenders decision to award Ruchi Soya to Adani Wilmar | Sakshi
Sakshi News home page

ఎన్‌సీఎల్‌టీలో పతంజలి పిటిషన్‌

Aug 25 2018 1:12 AM | Updated on Aug 25 2018 1:12 AM

Patanjali objects to lenders decision to award Ruchi Soya to Adani Wilmar - Sakshi

న్యూఢిల్లీ: రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్‌ బిడ్‌కు ఆమోదం తెలపడాన్ని సవాల్‌ చేస్తూ పతంజలి ఆయుర్వేద కంపెనీ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. రూ.12,000 కోట్ల భారీ బ్యాంక్‌ రుణాల కారణంగా రుచి సోయా కంపెనీపై దివాలాప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా రుచి సోయాను టేకోవర్‌ చేయడానికి అదానీ విల్మర్‌తో పాటు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్‌ కూడా బిడ్‌లు వేశాయి.

రుచిసోయా రుణదాతలు రూ.6,000 కోట్ల అదానీ విల్మర్‌ బిడ్‌కు ఆమోదం తెలిపాయి. దీనిని ఎన్‌సీఎల్‌టీ ఆమోదించాల్సి ఉంది. అయితే రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్‌కు ఆమోదం తెలపడాన్ని సవాల్‌ చేస్తూ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)ను పతంజలి ఆయుర్వేద్‌ ఆశ్రయించింది. దీనిపై ఈ నెల 27న(సోమవారం) విచారణ జరిగే అవకాశాలున్నాయని అంచనా.

వివాదమిది...
రుచి సోయాను చేజిక్కించుకోవడానికి అదానీ విల్మర్, పతంజలిల మధ్య దీర్ఘకాలంగా పోరు జరుగుతోంది. అదానీ విల్మర్‌ రూ.6,000 కోట్ల మేర బిడ్‌ను దాఖలు చేయగా, పతంజలి ఆయుర్వేద కంపెనీ రూ.5,700 కోట్ల మేర్‌ బిడ్‌ను దాఖలు చేసింది. రుచి సోయా రుణదాతలు అదానీ విల్మర్‌ బిడ్‌కు పచ్చజెండా ఊపారు.

ఏ ప్రాతిపదికన అదానీ విల్మర్‌ బిడ్‌ను ఆమోదించారో వెల్లడించాలని పతంజలి ఆయుర్వేద్‌ ప్రశ్నించింది. ఈ ప్రక్రియకు సంబంధించిన రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ (ఆర్‌పీ), శేలైంద్ర అజ్మీరకు న్యాయ సలహాదారుగా సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ నియామకాన్ని కూడా పతంజలి కంపెనీ తప్పుపట్టింది. అదానీ గ్రూప్‌నకు కూడా సిరిల్‌ అమర్‌చంద్‌ న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తున్నారని వివరించింది.  

వ్యాఖ్యానించడానికి పతంజలి నిరాకరణ...
ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తున్నామని పతంజలి ప్రతినిధి ఎస్‌.కె. తిజరవాలా పేర్కొన్నారు. మరోవైపు అదానీ గ్రూప్‌ ప్రతినిధి కూడా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement