
పబ్లిక్ ఆఫర్ రుణాలకు పెరుగుతున్న డిమాండ్
అదృష్టం తోడైతే మంచి లాభం
తేడా వస్తే భారీ నష్టాల రిస్క్
షేర్లు వస్తాయన్న గ్యారంటీ లేదు
ప్రాసెసింగ్, వడ్డీ చార్జీలు సమర్పించుకోవాల్సిందే...
ప్రైమరీ మార్కెట్‌లో ఐపీవోల (పబ్లిక్ ఆఫర్) సందడి నెలకొంది. పేరొందిన కంపెనీలకే కాదు, చిన్నా చితకా పబ్లిక్ ఆఫర్‌లకు సైతం స్పందన అదిరిపోతోంది. పట్టణాల్లో ఇంటి వద్దకే పలు రకాల సేవలను ఆఫర్ చేసే ‘అర్బన్ కంపెనీ’ గత నెలలోనే విజయవంతంగా ఐపీవోని ముగించుకుంది. రూ.1,900 కోట్ల సమీకరణకు రాగా.. రూ.1.95 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చిపడ్డాయి. 103 రెట్ల స్పందన వచ్చింది. లిస్టింగ్‌లోనే ఇన్వెస్టర్లకు 56 శాతానికి పైగా లాభాన్నిచ్చింది. ఇదొక్క ఉదాహరణే.
కొన్ని ఐపీవోలు లిస్టింగ్‌తోనే అదరగొడుతుండడంతో రిటైల్ ఇన్వెస్టర్లు, హెచ్‌ఎన్‌ఐల్లో (హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్లు) లాభాల కాంక్ష ఉరకలెత్తుతోంది. రుణం తీసుకుని మరీ ఎక్కువ షేర్ల కోసం బిడ్లు వేస్తున్నారు. ఫలితంగా ఐపీవో ఫండింగ్ మార్కెట్ విస్తరిస్తోంది. ఇది గమనించిన ఆర్‌బీఐ ఒక వ్యక్తికి ఐపీవో రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్టు ఇటీవలి పాలసీ సమీక్షలో ప్రకటించింది. రుణంతో ఐపీవోలో పాల్గొనడం వల్ల లాభాలే కాదు, తేడా వస్తే నష్టాలనూ భరించాల్సి వస్తుంది. ఇందులో ఉండే రిస్క్ లను తెలుసుకోకుండా దూకుడు ప్రదర్శించడం ఎంత మాత్రం మంచిది కాదు.
2024–25 ఆర్థిక సంవత్సరంలో 16 బ్యాంకులు సంయుక్త్తంగా మంజూరు చేసిన ఐపీవో రుణాల మొత్తం రూ.7,748 కోట్లు. ఇందులో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకే రూ.5,030 కోట్ల రుణ వితరణ చేసింది. కొన్ని బ్యాంక్‌లు వాటి సబ్సిడరీల రూపంలోనూ ఐపీవో ఫండింగ్‌ను అందిస్తున్నాయి. బ్యాంకింగేతర ఆరి్థక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), బ్రోకరేజీ సంస్థలు ఈ విభాగంలో ఇంతకంటే పెద్ద మొత్తంలోనే ఫండింగ్‌ను సమకూరుస్తున్నాయి.
అర్బన్ కంపెనీ ఐపీవోలో నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ (ఎన్‌ఐఐ) విభాగంలో 78 రెట్లు అధికంగా బిడ్లు రాగా, రిటైల్ విభాగంలోనూ 41 రెట్ల అధిక స్పందన వచ్చింది. ముఖ్యంగా ఎన్‌ఐఐ విభాగంలో ఎక్కువ మంది రుణంతోనే బిడ్లు వేస్తుంటారు. 2022లో ఎల్‌ఐసీ ఐపీవో సందర్భంగా ఎల్‌ఐసీ ఉద్యోగులకు ఎస్‌బీఐ రుణాన్ని ఆఫర్ చేసింది. ఒక్కొక్కరికీ రూ.20 లక్షల రుణాన్ని 7.10 శాతం వడ్డీపై, 60 నెలల కాల వ్యవధితో ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఉద్యోగి, పాలసీదారుడు, రిటైల్ ఇలా మూడు విభాగాల్లోనూ షేర్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండడంతో అధిక మొత్తంలో రుణాన్ని ఆఫర్ చేసింది.
రుణ షరతులు, నియమాలు
బ్యాంక్‌లు 3–6 రోజుల కాల వ్యవధికి ఐపీవో ఫండింగ్‌ను అందిస్తున్నాయి. వీటిపై వడ్డీ రేటు 9–15 శాతం వరకు ఉంటుంది. అదే ఎన్‌బీఎఫ్‌సీల్లో అయితే ఇంతకు రెట్టింపులో ఉంటోంది. మార్కెట్లో నగదు లభ్యత, ఈక్విటీ మార్కెట్లలో సెంటిమెంట్ తదితర అంశాలు రుణంపై వడ్డీని ప్రభావితం చేస్తుంటాయి. పైగా రుణ విలువపై ఒక శాతం వరకు ప్రాసెసింగ్ చార్జీని చెల్లించాల్సి ఉంటుంది. ఐపీవోలో వేస్తున్న బిడ్ విలువకు సరిపడా రుణాన్ని పొందలేరు. ఇన్వెస్టర్ తన వంతుగా కొంత సమకూర్చుకోవాలి. ఇది ఎంతన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏ కంపెనీ ఐపీవోకు దరఖాస్తు చేస్తున్నారు? దరఖాస్తుదారుడి గత రుణ చెల్లింపుల చరిత్ర, మార్కెట్ పరిస్థితులను బ్యాంక్‌లు/ఎన్‌బీఎఫ్‌సీలు పరిగణనలోకి తీసుకుంటాయి. సాధారణంగా 10–25 శాతం వరకు ఇన్వెస్టర్ తన వంతు వాటా కింద సిద్ధం చేసుకోవాలి. అప్పుడే మిగిలిన మొత్తానికి రుణం లభిస్తుంది.
‘‘రుణాన్ని 3–4 రోజుల్లో క్లియర్ చేసినప్పటికీ.. 7 రోజుల కాలానికి వడ్డీ చెల్లించాల్సిందే. లిస్టింగ్ రోజునే షేర్లను విక్రయించాలి. ఆ తర్వాత కూడా షేర్లను కొనసాగించుకోవాలంటే సొంత నిధులతోనే సాధ్యపడుతుంది. లిస్టింగ్ రోజునే ప్రిన్సిపల్ (అసలు) మొత్తాన్ని చెల్లించాలని బ్యాంక్‌లు కోరుతుంటాయి’’ అని జెరోదా వైస్ ప్రెసిడెంట్ మోహిత్ మెహ్రా తెలిపారు. కొన్ని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు లిస్టింగ్ తర్వాత కూడా ఆ షేర్లను కొనసాగించుకునేందుకు అనుమతిస్తున్నాయి. ఒకవేళ ఐపీవోలో కేటాయించిన ధర కంటే తక్కువకు లిస్ట్ అయి, నష్టాల్లో కొనసాగుతుంటే, వ్యత్యాసం మేర అదనపు నిధులు సమకూర్చాలని ఇన్వెస్టర్లను కోరతాయి. ఆ మేరకు సర్దుబాటు చేస్తే, షేర్లను వెంటనే విక్రయించనక్కర్లేదు.
ఎంత రుణం?
ఐపీఓలకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక పాన్ నంబర్‌పై బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ఇప్పుడు రూ. 25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. గతంలో ఈ పరిమితి రూ.10 లక్షలుగానే ఉండగా ఆర్‌బీఐ తాజాగా పెంచింది. ఎన్‌బీఎఫ్‌సీ అనుబంధ సంస్థలున్న బ్రోకరేజీ సంస్థలు కూడా ఐపీఓ ఫండింగ్ విషయంలో ఇన్వెస్టర్లను
ప్రోత్సహిస్తున్నాయి.
రిస్క్ లు..
ఐపీవో ధర కంటే ఎక్కువలో లిస్టింగ్ అయితే మంచి లాభాలు కళ్లజూడొచ్చు. దీంతో తీసుకున్న రుణంపై బ్యాంక్‌లకు/ఎన్‌బీఎఫ్‌సీలకు అసలుతోపాటు వడ్డీని సులభంగా చెల్లించేయొచ్చు. తన వంతు ఎంతో కొంత లాభాన్ని మిగుల్చుకోవచ్చు. ఒకవేళ కేటాయించిన ధర కంటే తక్కువలో లిస్ట్ అయితే పరిస్థితి ఏంటి?. రుణం ఇచ్చిన బ్యాంక్ లేదా సంస్థ వడ్డీతోపాటు రాబట్టుకునేందుకే ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఇన్వెస్టర్ లాభ, నష్టాలతో వాటికి అవసరం లేదు. కొన్ని సంస్థలు 90 రోజుల వరకు అనుమతిస్తున్నాయి కదా అని చెప్పి.. వడ్డీ చెల్లించుకుంటూ అంత కాలం పాటు ఆ షేర్లను కొనసాగించడం కూడా తెలివైన నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే అన్ని రోజులు ఆగినప్పటికీ లాభాలు వస్తాయన్న గ్యారంటీ ఉండదు కదా?! కనుక లాభం వచ్చినా, నష్టం వచ్చినా లిస్టింగ్ రోజునాడు విక్రయించడమే సరైన విధానం అవుతుంది. ఒకవేళ షేర్లపై నష్టం బుక్ చేసుకుంటే, రుణంపై వడ్డీ రూపంలోనూ మరికొంత నష్టపోవాల్సి వస్తుంది.
ఇక పెద్ద మొత్తంలో రుణం తీసుకుని ఐపీవోలో బిడ్ వేసినప్పటికీ.. షేర్లు దక్కుతాయన్న హామీ ఉండదు. 50–100 రెట్లకు పైగా స్పందన వచ్చిన ఐపీవోల్లో కేటాయింపు అవకాశాలు చాలా తక్కువ. షేర్లు దక్కకపోతే అప్పుడు ఐపీవో కోసం తీసుకున్న రుణంపై వడ్డీని సొంత జేబు నుంచి చెల్లించుకోవాల్సి ఉంటుందని ఏంజెల్‌వన్ అడ్వైజరీ చీఫ్ అమర్‌దియో సింగ్ పేర్కొన్నారు. సాధారణంగా అధిక స్పందన ఉన్న ఐపీవోల్లో అలాట్‌మెంట్ అవకాశాలు చాలా తక్కువ. పరిమిత స్పందన ఉన్న వాటిల్లోనే కేటాయింపు అవకాశాలు ఎక్కువ. పరిమిత స్పందన వచ్చిన ఐపీవోలు లిస్టింగ్‌లో మంచి లాభాలు పంచడం తక్కువ కేసుల్లోనే కనిపిస్తోంది. జొమాటో, అర్బన్ కంపెనీ తదితర ఐపీవోలు లిస్టింగ్‌తోనే లాభాలు పంచగా, పేటీఎం, కల్యాణ్ జ్యువెలర్స్, కార్‌ట్రేడ్ టెక్, ఎస్‌బీఐ కార్డ్ కేటాయించిన ధర కంటే తక్కువకే లిస్ట్ కావడం గమనించాలి. హ్యుందాయ్ మోటార్స్ లిస్టింగ్‌లో లాభాలను ఇవ్వకపోగా, కేటాయించిన ధర కంటే కిందకు పడిపోయి చాలా కాలం స్థిరీకరణకు నోచుకుంది. ఆ తర్వాత కొత్త గరిష్టాలను చూసింది.
సెబీ అధ్యయనం ప్రకారం ఐపీవోల్లో హెచ్‌ఎన్‌ఐ విభాగంలో 60–75 శాతం మధ్య దరఖాస్తులకు కేటాయింపులు లభించడం లేదు. రూ.75 లక్షల నుంచి రూ.కోటి మొత్తంతో బిడ్ వేసినా ఒక్క షేరు కూడా రాని సందర్భాలు కూడా ఉంటాయి. పెద్ద మొత్తంతో బిడ్ వేసినప్పటికీ.. చివరికి కొన్ని షేర్లే అలాట్ అయిన సందర్భాల్లోనూ వచ్చే లాభం వడ్డీ చెల్లించడానికి సరిపోకపోవచ్చు. లిస్టింగ్ నాటికి మార్కెట్లలో భారీ కరెక్షన్ చోటుచేసుకుంటే, అప్పుడు కూడా నష్టాల రిస్క్ ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు రుణంపై ఐపీవోలో దరఖాస్తు చేసుకోవడానికి ముందు ఈ పరిస్థితులను సమగ్రంగా విశ్లేíÙంచుకోవాలి. తన రిస్క్ సామర్థ్యం, ఎంత మేరకు నష్టాలను భరించగలమో అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
చెల్లించడంలో విఫలమైతే..
రుణం మంజూరుకు ముందుగా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు ఒప్పందంపై సంతకాలు చేయించుకుంటాయి. ఐపీవోలో కేటాయించే షేర్లను విక్రయించేందుకు పవర్ ఆఫ్ అటార్నీ (పీవోఏ) తీసుకుంటాయి. ఇన్వెస్టర్ నిరీ్ణత గడువులోపు షేర్లను విక్రయించి, అసలు.. వడ్డీ చెల్లించడంలో విఫలమైతే రుణం ఇచ్చిన సంస్థలు బ్రోకరేజీల ద్వారా వాటిని విక్రయించేస్తాయి. ఇన్వెస్టర్ సమకూర్చిన మార్జిన్ మనీకి మించి నష్టాలు వస్తే.. అప్పుడు మిగిలిన బకాయి రాబట్టుకోవడానికి బ్యాంకులు/ఎన్‌బీఎఫ్‌సీలు చట్టపరమైన చర్యలు చేపడతాయి.
షేర్లు, ఫండ్స్‌పై రుణం
రిటైల్ ఇన్వెస్టర్లు తమ షేర్లు, ఫండ్స్‌పై రుణం తీసుకుని కూడా ఐపీవోలో పాల్గొనొచ్చు. ఇందుకు బ్రోకరేజీలు, ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు సైతం అనుమతిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ షేర్ల తనఖా విలువపై 50–75% వరకు రుణం లభిస్తుంది. వడ్డీ రేటు 12–15 శాతం వరకు ఉంటుంది. ఒక్కో ఇన్వెస్టర్ గరిష్టంగా రూ.కోటి వరకు రుణం పొందేందుకు ఆర్‌బీఐ ఇటీవలే అనుమతించింది.
హెచ్‌ఎన్‌ఐ విభాగంలో దరఖాస్తులు..
రిటైల్ ఇన్వెస్టర్లు రిటైల్ కోటాలో గరిష్ఠంగా రూ.2 లక్షల విలువైన షేర్లకు మాత్రమే బిడ్ వేయగలరు. అదే నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ (ఎన్‌ఐఐ) విభాగంలో రూ.2 లక్షలకు మించి, ఎంత మొత్తానికి అయినా బిడ్ దాఖలు చేసుకోవచ్చు. ఐపీవోల్లో సాధారణంగా రిటైల్ ఇన్వెస్టర్లకు 10–35 శాతం మధ్య, ఎన్‌ఐఐలకు 15–35 శాతం మధ్య కోటా ఉంటుంది. ఎన్‌ఐఐలోనూ రెండు విభాగాలు ఉంటాయి. రూ.2–10 లక్షల వరకు బిడ్లను స్మాల్ ఎన్‌ఐఐ కింద పరిగణిస్తారు. మొత్తం ఎన్‌ఐఐ కోటాలో వీరికి మూడింట ఒక వంతు షేర్ల కోటా ఉంటుంది. మిగిలినది రూ.10 లక్షలకు మించిన బిడ్లకు రిజర్వ్ చేస్తుంటారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్