
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో 2028లో జరగబోయే గవర్నర్ ఎన్నికల్లో తన పోటీపై మాజీ ఉపాధ్యక్షురాలు, అమెరికన్ డెమొక్రాటిక్ పార్టీ సభ్యురాలు కమలా హారిస్ ఆసక్తికర ప్రకటన చేశారు. గతంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్, యూఎస్ సెనేటర్‌గా పనిచేసిన కమలా హారిస్ తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికలను సూచన ప్రాయంగా వెల్లడించారు.
2026లో కాలిఫోర్నియా గవర్నర్ పదవికి జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కమలా హారిస్ తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేశారు. ఈ ప్రకటన నేపధ్యంలో ఆమె 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తన పోస్టులో కమలా హారిస్.. ‘గత ఆరు నెలలుగా తాను అమెరికన్ ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం కొనసాగించేందుకు ఉత్తమ మార్గం గురించి ఆలోచిస్తున్నాను. నా కెరీర్ తొలి రోజుల నుండి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి, మెరుగైన భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను. ఇందుకు ఉత్తమ మార్గం వ్యవస్థను సంస్కరించడమేనని నేను నమ్ముతున్నాను. ప్రాసిక్యూటర్, అటార్నీ జనరల్, యునైటెడ్ స్టేట్స్ సెనేటర్, వైస్ ప్రెసిడెంట్‌గా దేశానికి సేవ చేయడం నాకు గౌరవప్రదంగా ఉంది’ అని అన్నారు.
My statement on the California governor's race and the fight ahead. pic.twitter.com/HYzK1BIlhD
— Kamala Harris (@KamalaHarris) July 30, 2025
అలాగే 'ఇటీవల కొంతకాలంగా కాలిఫోర్నియా గవర్నర్‌గా పోటీ చేస్తారా? అని కొందరు అడిగిన దరిమిలా దీనిపై నేను ఆలోచించాను. నేను ఈ రాష్ట్రాన్ని, ఇక్కడి ప్రజలను ప్రేమిస్తున్నాను. అయితే లోతుగా ఆలోచించిన తర్వాత, ఈ ఎన్నికల్లో గవర్నర్ పదవికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతానికి నేను ఏ ఎన్నికైన పదవిలోనూ ఉండకూడదని అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో నా భవిష్యత్ ప్రణాళికల గురించి మరింత సమాచారాన్ని పంచుకుంటాను’ అని కమలా హారిస్ అన్నారు. ఆమె గతంలో రెండుసార్లు అధ్యక్ష పోటీలో నిలిచారు. అయితే రెండు సార్లూ ఓటమి పాలయ్యారు. 2024లో కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ట్రంప్ చేతిలో ఓడిపోయారు.