
భూ పొరల్లో మృత్యునర్తనం!
40 వేల కి.మీ. పొడవైన యమపాశం
ప్రకృతి ఓ దెయ్యంలా మెల్లగా ఒళ్లు విరుచుకుని అలా సాగర జలాల్లోకి కాలు పెట్టింది...! అంతే తీరాన్ని తుత్తునియలు చేసేలా అలలు మిన్నంటి మరీ ఎగిసిపడ్డాయి. ఆ ధాటికి భూమి ఉలిక్కిపడింది. రష్యాను ఠారెత్తించిన బలమైన భూకంపం, ఆ వెంటనే విరుచుకుపడ్డ సునామీ హడలెత్తించాయి. ప్రపంచపు మోకాలిగా చెప్పదగ్గ ఆ రహస్య ప్రాంతంలో పుట్టిన మంటలు, ప్రకంపనలతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఆ ప్రాంతమే ‘రింగ్ ఆఫ్ ఫైర్’. అగ్నిపర్వతాలు ఎందుకు అక్కడే ఉప్పొంగుతాయి? భూకంపాలు ఎందుకు అక్కడే ఠంచనుగా ప్రతి వారం సంభవిస్తాయి? ఈ వలయం, దాని తాలూకు విలయం వెనక దాగున్న రహస్యం ఏమిటి?
సైలెంట్
కిల్లర్
మౌనంగా కనిపించే మృగాలే మహా ప్రమాదకరం. రింగ్ ఆఫ్ ఫైర్‌లోని అగ్నిపర్వతాలు కూడా ఆ బాపతే. చూసేందుకు నిద్రాణంగా కనిపిస్తాయి కానీ, భూమి లోతుల్లో మంటలు ముదిరిన ప్రతిసారీ ఆ మౌనం పెను శబ్దంగా మారుతుంది. కొన్నిసార్లు విస్ఫోటనంలా బయటపడుతుంది. రష్యాలోని కమ్చా తీరంలో ఎగిసిపడి, ఇటు జపాన్‌తీరాన్ని కూడా తాకిన ఆ రాకాసి అలలకు కారణమదే. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అచ్చం వలయంలా ఉంటుంది. అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రాన్ని అట్టడుగున కప్పేసే అగ్నివలయమిది. ఈ మంటల మార్గం దాదాపు 40 వేల కిలోమీటర్ల పొడవుంటుంది!
దక్షిణ అమెరికా కొసన మొదలై ఉత్తర అమెరికా తీరాల దా కొనసాగుతుంది. అటు అలాస్కా ద్వీపాలను తాకి, బేరింగ్ సముద్రం దాటి, జపాన్ మీదుగా ఇటు న్యూజిలాండ్ వరకు వ్యాపించి ఉంది. దక్షిణ ధ్రువంలోని మంచు అగ్నిపర్వతాల వరకు చేరుతుంది. ఈ మార్గంలోని దేశాలు మనకు తెలియని ప్రమాదంతో నిత్యం మందుపాతరపై భయంభయంగా గడుపుతున్నాయి. చిలీ, పెరూ, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, న్యూజిలాండ్... ఇలా ప్రపంచంలోని అతి శక్తిమంతమైన అగ్నిపర్వతాలన్నీ ఈ వలయంలోనే ఉన్నాయి. భూకంపాలు, అగ్ని విస్ఫోటనలూ ఈ ప్రాంతంలోనే ఎక్కువ.
పలకల్లో కలకలం
రింగ్ ఆఫ్ ఫైర్‌లో జరుగుతున్నది భూమి లోతుల్లో భూ పలకల పోరాటం. బయటి నుంచి బలంగా, స్థిరంగా కనిపించే భూమి లోలోతుల్లో ఈ భూ పలకలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. అవి పరస్పరం ఢీకొన్నప్పుడు భూమి కంపిస్తుంది. ఒక పలక కిందకి జారితే అక్కడ పెను మంటల్లాంటివి పుట్టుకొస్తాయి. రష్యాలో తాజా భూకంపానికి కారణం కూడా ఇదే. పసిఫిక్ ప్లేట్ తాలూకు ఒక పెద్ద భూ పలకం, ఉత్తర అమెరికా పలకం పరస్పరం ఢీకొన్నాయి. దాంతో భూమి లోతుల్లో ఒత్తిడి పెరిగి భూగోళం అంతటినీ ఊపేసింది. అందుకే కమ్చట్కా తీరంలో ఏకంగా 8.8 తీవ్రతతో నేల వణికిపోయింది. ఆ వెంటనే సముద్రం గర్జించి అలలుగా ఎగిసింది. ఇలాంటివి రింగ్ ఆఫ్ ఫైర్‌లో నిజానికి నిత్య సన్నివేశాలే.
పసిఫిక్‌కు గుండెకాయ!
పసిఫిక్ మహాసముద్రాన్ని ఒక సువిశాల శరీరంగా భావిస్తే రింగ్ ఆఫ్ ఫైర్‌ను దాని గుండెగా చెప్పొచ్చు. అక్కడే శ్వాస, అక్కడే ధ్వని, అక్కడే మంట! ఈ గుండె ఒక్కసారి గట్టిగా కొట్టుకుందంటే చాలు... రష్యాలో అలలు ఎగసిపడతాయి. జపాన్ తీరాలు వణికిపోతాయి. అలాంటి గుండెపోటు ఇప్పుడు జరుగుతోంది. అదే కమ్చట్కాలో, జపాన్‌తీరాంలో సునామీ రూపంలో ఎగసిపడింది. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మానవాళికి ఒక శక్తి, ఒక శాపం, ఒక శాస్త్రం. అది ఎప్పుడు, ఎక్కడ మళ్లీ పుడుతుందో ఎవ్వరికీ తెలీదు. పుట్టిందంటే మాత్రం దాని దెబ్బకు ప్రపంచమంతా విలవిలలాడిపోవాల్సిందే.
– సాక్షి, నేషనల్ డెస్క్