
వాషింగ్టన్: పహల్గామ్ ఉగ్ర ఘటన తరువాత భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు వీటికి ఆజ్యం పోసేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు భారత్‌కు ఆగ్రహాన్ని తెప్పించేలా ఉన్నాయి. ఏదో ఒకరోజు భారత్‌కు పాకిస్తాన్ చమురు అమ్ముతుందని, అందుకు తాము పాక్‌కు సాయం చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్‌పై 25శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించిన కొన్ని గంటలకు ట్రంప్ మరోమారు భారత్- పాక్ మధ్య చిచ్పుపెట్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చమురు నిల్వలను భారీగా అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ తాజాగా అమెరికాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుక్నునదని, అయితే ఈ భాగస్వామ్యానికి ఏ కంపెనీ సారధ్యం వహించాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని ట్రంప్ పేర్కొన్నారు. బహుశా పాకిస్తాన్ ఏదో ఒక రోజు భారతదేశానికి చమురు అమ్మే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. తాము పాకిస్తాన్‌తో ఒక ఒప్పందాన్ని ముగించామని, ఈ మేరకు పాకిస్తాన్- యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా చమురు నిల్వలను భారీగా అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తాయన్నారు. ఇదే పోస్ట్‌లో ట్రంప్.. అమెరికాను చాలా సంతోషపెట్టాలని కోరుకునే పలు దేశాల నేతలతో మాట్లాడానని పేర్కొన్నారు. కొన్ని దేశాలు సుంకాల తగ్గింపు కోసం అమెరికాకు ఆఫర్లు ఇస్తున్నాయని, ఇది దేశ వాణిజ్య లోటును భారీగా తగ్గిస్తుందని పేర్కొన్నారు.
తాము వైట్ హౌస్ లో వాణిజ్య ఒప్పందాలపై కసరత్తు చేస్తూ చాలా బిజీగా ఉన్నామని, ఈరోజు మధ్యాహ్నం దక్షిణ కొరియా వాణిజ్య ప్రతినిధి బృందాన్ని కలుస్తానన్నారు. దక్షిణ కొరియా ప్రస్తుతం 25శాతం సుంకాలను కలిగివుందని, అయితే వారు ఆ సుంకాలను తగ్గించే ప్రతిపాదనతో ఉన్నారని, అందుకు వారు ఇచ్చే ఆఫర్ ఏమిటో వినడానికి తాను ఆసక్తిగా ఉన్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారతదేశంపై 25 శాతం సుంకాలు విధించనున్నామని, అయితే ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయని, ఈ వారం చివరి నాటికి సుంకాల విషయంలో స్పష్టత వస్తుందని ట్రంప్ వివరించారు.