ప్యాసింజర్‌ వాహనాల నెమ్మది!

Passenger Vehicle sales to slow down in H2: Maruti Suzuki - Sakshi

ఈ ఆర్థిక సంవత్సరం విక్రయాలు తగ్గుతాయి: క్రిసిల్‌

వృద్ధి అంచనాలు 9–11 శాతంనుంచి 7–9 శాతానికి కోత...

ముంబై: ప్రయాణికుల వాహన విక్రయ అంచనాలను రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ రీసెర్చ్‌ తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహన(పీవీ) విక్రయాలు 9–11 శాతం రేంజ్‌లో వృద్ధి చెందుతాయని క్రిసిల్‌ గతంలో అంచనా వేసింది. ఈ అంచనాలను తాజాగా 7–9 శాతానికి తగ్గించింది. డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉండటం, పండుగల సీజన్‌లో కూడా నిల్వలు అధికంగా ఉండటం దీనికి కారణాలని వివరించింది.పీవీ విక్రయాలకు సంబంధించి క్రిసిల్‌ రీసెర్చ్‌ తన తాజా నివేదికలో వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలివీ... 

∙గత ఏడాది అక్టోబర్‌లో 2,79,877 ప్రయాణీకుల వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో వాహన విక్రయాలు 1.6 శాతం వృద్ధితో 2,84,224కు పెరిగాయి. వీటిల్లో కార్ల అమ్మకాల వృద్ధి అంతంతమాత్రంగా ఉండగా, యుటిలిటీ వెహికల్స్‌ 4 శాతం వృద్ధి చెందాయి.  
∙ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్‌ వరకూ తగ్గిన పీవీ విక్రయాలు ఈ అక్టోబర్‌లో పెరిగాయి.  
∙సాధారణంగా దసరా, దీపావళి పండుగల అమ్మకాలు.. మొత్తం ఆర్థిక సంవత్సరం అమ్మకాల్లో ఐదవవంతుగా ఉంటాయి. అయితే ఈ ఏడాది దసరా, దీపావళి పండుగల అమ్మకాలు ఈ స్థాయిలో లేవు.  
∙ఈ ఏడాది అక్టోబర్‌ నెల మొదటి పది రోజుల్లో మంచి రోజులు లేవని ఉత్తర భారత దేశంలో కార్ల అమ్మకాలు పెద్దగా జరగలేదు.  
∙ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–అక్టోబర్‌ కాలానికి పీవీ అమ్మకాలు 6 శాతమే పెరిగాయి. 
∙ డిమాండ్‌ బాగా ఉన్న మోడళ్లకు వెయిటింగ్‌ పీరియడ్‌ రెండు వారాలకు తగ్గిపోయింది.  
∙కొత్త మోడళ్ల కంటే ప్రస్తుత మోడళ్లకు సంబంధించిన వేరియంట్లు అధికంగా ఉన్నాయి.  
∙కార్ల అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వాణిజ్య వాహన విక్రయాలు మాత్రం దుమ్మురేపాయి. ఈ అక్టోబర్‌లో వాణిజ్య వాహన అమ్మకాలు 25 శాతం ఎగిశాయి. ఈ వాహన విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించడం ఇది వరుసగా 12వ నెల కావడం విశేషం.  
∙మధ్య తరహా, భారీవాణిజ్య వాహన విక్రయాలు ఈ అక్టోబర్‌లో 18% పెరిగాయి. టిప్పర్‌ సెగ్మెంట్‌ అమ్మకాలు జోరుగా ఉన్నాయి. నిర్మాణ రంగంలో కార్యకలాపాలు జోరు పెరగడం, పారిశ్రామిక కార్యకలాపాల పుంజుకోవడం దీనికి ప్రధాన కారణాలు.  
∙ఇక టూ వీలర్‌ అమ్మకాలు 17 శాతం పెరిగాయి. పండుగల సీజన్‌లో డిమాండ్‌ బాగానే ఉన్నప్పటికీ, బీమా ప్రీమియమ్‌ భారీగా పెరగడంతో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top