వాహన విక్రయాలకు స్పీడు బ్రేకర్లు.. 

Passenger vehicle sales hit speed breaker in 2018-19, grow just 2.7% - Sakshi

2018–19 ప్యాసింజర్‌ వాహన విక్రయాల వృద్ధి 2.7 శాతమే

న్యూఢిల్లీ: దేశీయంగా ప్యాసింజర్‌ వాహనాల విక్రయాల జోరుకు గతేడాదిలో గట్టిగానే స్పీడు బ్రేకర్లు తగిలాయి. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) గణాంకాల ప్రకారం.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్‌ వాహనాలు కేవలం 2.7 శాతం వృద్ధితోనే సరిపెట్టుకున్నాయి. గతేడాది విక్రయాలు 33,77,436 యూనిట్లు కాగా, 2017–18 అమ్మకాలు 32,88,581 యూనిట్లుగా నమోదయ్యాయి. నూతన వాహనాల విడుదల ఉన్నప్పటికీ.. గతేడాది ద్వితీయార్థంలో గణనీయంగా తగ్గిన అమ్మకాల కారణంగా కనీసం అంచనాలకు దగ్గరగా కూడా విక్రయాలు చేరుకోలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది ప్రారంభంలో 8 నుంచి 10 శాతం వరకు విక్రయాల్లో వృద్ధి ఉంచవచ్చని సియామ్‌ అంచనా వేయగా.. మారిన పరిస్థితుల రీత్యా ఈ అంచనాను 6 శాతానికి సవరించింది. అయితే, ఈకాలంలో ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) తగ్గడం, అధిక వాహన ధరలు, సాధారణ ఎన్నికల కారణంగా ఏర్పడిన అనిశ్చితి వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో పూర్తిఏడాది అమ్మకాలు 2.7 శాతం వృద్ధికే పరిమితమయ్యాయి.

ఈ అంశంపై సియామ్‌ అధ్యక్షుడు రాజన్‌ వదేరా మాట్లాడుతూ.. ‘సానుకూల అంశం వైపు నుంచి చూస్తే.. వృద్ధిరేటు ఒక అంకెకే పరిమితం అయ్యిందా, లేదంటే రెండెంకల వృద్ధిరేటా అనే విషయాన్ని పక్కన పెడితే.. గతేడాదిలో కూడా వృద్ధి కొనసాగింది. అధిక ముడివస్తువుల ధరల కారణంగా పరిశ్రమ గతేడాదిలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఇక బీఎస్‌ సిక్స్‌ పరివర్తన మరో కీలక అంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈఏడాది అమ్మకాలు 3 నుంచి 5 శాతం మధ్య ఉండవచ్చని అంచనావేస్తున్నాం. దేశ అర్థిక అభివృద్ధిపై పాజిటివ్‌గా ఉన్నాం. ప్రభుత్వం పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ ఇన్‌ఫ్రా అభివృద్ధి కొనసాగిస్తోంది. బీఎస్‌ సిక్స్‌ ఉద్గార నిబంధనల పరివర్తన ముందు కొనుగోళ్లు జరుగుతాయని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.  

కార్ల విక్రయాల్లో స్వల్ప వృద్ధి!
దేశీ కార్ల విక్రయాల్లో గతేడాది స్వల్ప వృద్ధిరేటు నమోదైంది. 2018–19లో 22,18,549 కార్లు అమ్ముడు కాగా, అంతక్రితం ఏడాదిలో 21,74,024 యూనిట్లు అమ్ముడయ్యాయి. యుటిలిటీ వాహనాలు (యూవీ) విక్రయాలు 2.08 శాతం వృద్ధితో 9,41,461 యూనిట్లుగా నిలిచాయి. మొత్తం ప్యాసింజర్‌ వాహనాల ఎగుమతుల్లో 9.64 శాతం క్షీణత నమోదైంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top