భారత్‌కు గూగుల్‌ బొనాంజా!

 Oreo Go Edition is meant for entry-level smartphones - Sakshi

చౌక స్మార్ట్‌ఫోన్లకోసం ‘ఓరియో గో’ ఓఎస్‌

మ్యాప్స్‌లో కొత్తగా బైక్‌ మోడ్‌ ఫీచర్‌

జియో ఫీచర్‌ ఫోన్లలోనూ వర్చువల్‌ అసిస్టెంట్‌  

న్యూఢిల్లీ: భారత్‌ తదితర మార్కెట్లలో ఇంటర్నెట్‌ వినియోగాన్ని మరింత పెంచే దిశగా టెక్‌ దిగ్గజం గూగుల్‌ పలు ఆవిష్కరణలు చేసింది. చౌక స్మార్ట్‌ఫోన్ల కోసం ఆండ్రాయిడ్‌ ‘ఓరియో గో’ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. అలాగే ద్విచక్ర వాహనదారులకూ మరింతగా ఉపయోగపడేలా మ్యాప్స్‌కి సంబంధించి బైక్‌ మోడ్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. అటు రిలయన్స్‌ జియో స్మార్ట్‌ ఫీచర్‌ ఫోన్లలో గూగుల్‌ అసిస్టెంట్‌ ఫీచర్‌ (వర్చువల్‌ అసిస్టెంట్‌) కస్టమైజ్డ్‌ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దైనందిన కార్యకలాపాల్లో ఇంటర్నెట్‌ ఉపయోగంపై మరింతగా అవగాహన కల్పించే దిశగా ప్రత్యేకంగా భారత మార్కెట్‌కి అనువైన ఉత్పత్తులు, ఫీచర్స్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్‌లో భాగమైన నెక్ట్స్‌ బిలియన్‌ యూజర్స్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ సీజర్‌ సేన్‌గుప్తా తెలిపారు. గూగుల్‌ మ్యాప్స్‌లో బైక్‌ మోడ్, తేజ్‌ చెల్లింపుల విధానం మొదలైనవన్నీ పెద్ద సంఖ్యలో భారతీయుల జీవనవిధానాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవేనని తెలియజేశారు. ‘ఈ ఉత్పత్తులు, ఫీచర్స్‌ అన్నీ కూడా ముందుగానే భారత్‌లోనే ప్రవేశపెడుతున్నాం. కాకపోతే, ఇవి ఇక్కడికి మాత్రమే పరిమితం కావు. ఇక్కడి వారికి ఉపయోగపడేంత మెరుగైన ఉత్పత్తులంటే... అవి మిగతా దేశాల్లోని వారికీ అనువైనవనే భావించవచ్చు‘ అని గూగుల్‌ ఫర్‌ ఇండియా–2017 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ఫైల్స్‌ గో లాంటి యాప్స్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చగలవని, డేటా వినియోగం తగ్గించగలవని ఆయన చెప్పారు.

వచ్చే ఏడాది ఓరియో గో హ్యాండ్‌సెట్స్‌..
ఆండ్రాయిడ్‌ ఓరియో (గో) ఓఎస్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లను హ్యాండ్‌సెట్‌ తయారీ సంస్థలు వచ్చే ఏడాది తొలినాళ్లలో ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు సేన్‌గుప్తా చెప్పారు. రామ్‌ సామర్ధ్యం 1జీబీ లేదా అంతకన్నా తక్కువున్న హ్యాండ్‌సెట్స్‌కి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ స్థాయి ఆండ్రాయిడ్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్ల కోసం గూగుల్‌ గతంలో మైక్రోమ్యాక్స్, స్పైస్‌ వంటి దేశీ హ్యాండ్‌సెట్‌ తయారీ సంస్థలతో చేతులు కలిపినప్పటికీ.. ఆ ప్రాజెక్టు పెద్దగా ఫలితాలు సాధించలేదు. మరోవైపు తొలిసారి స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించే వారిని దృష్టిలో ఉంచుకుని మరింత తేలికపాటి యాప్స్‌ని కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు సేన్‌గుప్తా తెలిపారు. గూగుల్‌ గో సెర్చి ఇంజిన్, యూట్యూబ్‌ గో మొదలైనవి ఆ కోవకి చెందినవేనని చెప్పారు. ఇక ఇంగ్లిష్‌తో పాటు హిందీ భాషలోనూ గూగుల్‌ అసిస్టెంట్‌ను రిలయన్స్‌ జియో ఫోన్స్‌ కోసం రూపొందించినట్లు చెప్పారు. ‘‘ఫీచర్‌ ఫోన్‌లో గూగుల్‌ వర్చువల్‌ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా 20 నగరాల్లో వాయు కాలుష్య సంబంధ సమాచారాన్ని సైతం త్వరలో మా యాప్స్‌ ద్వారా అందిస్తాం. ద్విచక్ర వాహనాలకూ ఉపయోగపడే మ్యాప్స్‌ ఫీచర్‌ మంగళవారం నుంచి భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. రాబోయే నెలల్లో మిగతా దేశాల్లోనూ ప్రవేశపెడతాం. రైల్‌టెల్‌ భాగస్వామ్యంతో ప్రస్తుతం రైల్వేస్టేషన్లలో అందిస్తున్న వైఫై సదుపాయాన్ని వచ్చే ఏడాది 400 స్టేషన్లకి విస్తరిస్తాం’’ అని వివరించారు. వివిధ నగరాల్లో వైఫై హాట్‌స్పాట్స్‌ ఏర్పాటు చేసే ప్రాజెక్టుపై పనిచేస్తున్నామని, త్వరలో దీన్ని ఇండొనేషియా తదితర మార్కెట్లకు కూడా విస్తరిస్తామని సేన్‌గుప్తా చెప్పారు.

నెలకు 11 జీబీ డేటా వినియోగం..
వచ్చే నాలుగేళ్లలో భారత్‌లో డేటా వినియోగం దాదాపు మూడు రెట్లు ఎగిసి నెలకు సగటున 11 జీబీ స్థాయికి పెరగవచ్చని గూగుల్‌ ఇండియా విభాగం హెడ్‌ రాజన్‌ ఆనందన్‌ చెప్పారు.

మరిన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సాథీ...
మహిళల్లో డిజిటల్‌ అక్షరాస్యత పెంచే క్రమంలో టాటా ట్రస్ట్స్‌ భాగస్వామ్యంతో ప్రవేశపెట్టిన ఇంటర్నెట్‌ సాథీ ప్రాజెక్టును మరింతగా విస్తరించనున్నట్లు గూగుల్‌ మార్కెటింగ్‌ విభాగం హెడ్‌ (ఆగ్నేయాసియా, ఇండియా) సప్నా చడ్ఢా తెలిపారు. 2015 జూలైలో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద ఇప్పటిదాకా 30,000 మంది పైచిలుకు మహిళలకు శిక్షణనిచ్చినట్లు వివరించారు. ఇప్పటిదాకా 1.1 లక్షల గ్రామాల్లో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరికొన్నేళ్లలో 3 లక్షల గ్రామాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top