ఆన్‌లైన్‌ గేమింగ్‌ 12 వేల కోట్లు

The online gaming industry to touch Rs 11900 crore by 2023 - Sakshi

2023 ఆర్థిక సంవత్సరం నాటికి అంచనా

2018–2023 మధ్య 22% వార్షిక వృద్ధి

కేపీఎంజీ– గేమింగ్‌ ఫెడరేషన్‌ నివేదికలో వెల్లడి

ముంబై: డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గణనీయంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగం భారీ స్థాయిలో వృద్ధి చెందుతోంది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ.11,900 కోట్లకు చేరనున్నట్లు కేపీఎంజీ– ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ గేమింగ్‌ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ.2,000 కోట్లుగా ఉన్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ 2018 రూ.4,400 కోట్లకు చేరింది. ఇదే ధోరణి కొనసాగిన పక్షంలో 2018– 2023 మధ్యకాలంలో ఈ పరిశ్రమ ఆదాయాలు 22 శాతం వార్షిక వృద్ధితో రూ.11,900 కోట్లకు చేరతాయని నివేదిక వివరించింది. మరోవైపు గేమర్స్‌ సంఖ్య 2018లో 25 కోట్లకు చేరింది. ఈ రంగం ఆదాయాల్లో సింహభాగం వాటా మొబైల్‌ ఫోన్స్‌దే. 2017 ఆర్థిక సంవత్సరంలో ఇది 85 శాతంగా ఉంది. స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గుతుండటం, వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య పెరుగుతుండటం, డేటా ధరలు తగ్గుతుండటం తదితర అంశాలు మొబైల్‌ గేమింగ్‌ పరిశ్రమ వృద్ధికి ఊతంగా ఉంటున్నాయి.  

పజిల్స్, యాక్షన్‌ టాప్‌.. 
దేశీయంగా టాప్‌ గేమ్స్‌లో పజిల్స్, యాక్షన్, అడ్వెంచర్‌ సంబంధ గేమ్స్‌ ఉన్నాయి. కొత్త స్పోర్ట్స్‌ లీగ్స్‌ తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఫ్యాంటసీ స్పోర్ట్స్‌కీ ఆదరణ పెరుగుతోంది. దేశీయంగా ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ ఆపరేటర్స్‌ సంఖ్య 2016లో 10గా ఉండగా.. 2018 నాటికి ఏకంగా ఏడు రెట్లు పెరిగి 70కి చేరింది. ఇక పెద్ద నగరాలతో పోలిస్తే ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ని తరచుగా ఆడే వారి సంఖ్య చిన్న పట్టణాల్లోనే ఎక్కువగా ఉంటోంది.  7–8 టాప్‌ నగరాల్లోని మెజారిటీ యూజర్లు ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ని వారంలో 1–3 సార్లు ఆడుతుండగా.. చిన్న పట్టణాల్లోని 70 శాతం మంది యూజర్లు వారంలో నాలుగుసార్లకు పైగా ఆడుతున్నారు. ఇక అత్యధికంగా 71 శాతం మంది ఫ్యాంటసీ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కాగా, 54 శాతం మంది ఫుట్‌బాల్‌ ఆడారు. యూజర్లు తమ ఫేవరెట్‌ స్పోర్ట్స్‌లో మరింతగా పాలుపంచుకునేందుకు ఈ తరహా స్పోర్ట్స్‌ ఉపయోగపడతాయని కేపీఎంజీ పార్ట్‌నర్, మీడియా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగం హెడ్‌ గిరీష్‌ మీనన్‌ చెప్పారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top