స్వల్పంగా తగ్గినా... కీలక మద్దతుపైనే!

New York Commodity Exchanges in fall state - Sakshi

వారంలో పసిడి ఐదు డాలర్ల డౌన్‌

1,271 డాలర్ల వద్ద ముగింపు

వరసగా మూడోవారం తిరోగమనం

1,250 డాలర్ల పైన ఉన్నంతవరకూ ‘బుల్‌’ అంటున్న నిపుణులు  

ముంబై/న్యూఢిల్లీ: న్యూయార్క్‌ కమోడిటీ ఎక్స్చేంజిలో పసిడి వరుసగా మూడవ వారమూ తగ్గింది. చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ఔన్స్‌ (31.1గ్రా) ధర 3వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో స్వల్పంగా ఐదు డాలర్లు తగ్గి 1,271 డాలర్లకు చేరింది. విశ్లేషకుల అంచనాల  ప్రకారం– 1,250 డాలర్ల దిగువకు పడితేనే, ఈ మెటల్‌ బేరిష్‌ ధోరణిని ప్రతిబింబిస్తుంది.

అమెరికా ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగితేనే ప్రస్తుత దశలో  పసిడిలో పెట్టుబడులకు ఊతం లభిస్తుందనేది కమోడిటీ విశ్లేషకుల అంచనా. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ సానుకూల అంచనాలతో ఒకవేళ డాలర్‌ బలపడితే మాత్రం పసిడిపై అది ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని కూడా వారు చెబుతున్నారు. గడచిన వారంలో పసిడి స్వల్పంగా బలహీనపడగా, మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌ 0.11 సెంట్ల లాభంతో 94.83కు ఎగసింది. రెండు నెలల్లో పసిడి దాదాపు గరిష్ట స్థాయి నుంచి దాదాపు 100 డాలర్ల నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో డాలర్‌ ఇండెక్స్‌ కనిష్ట స్థాయి నుంచి ఐదు డాలర్లు  పైకి లేచింది.

భిన్న వాదనలు...
బ్లూలైన్‌ ఫ్యూచర్స్‌ ప్రెసిడెంట్‌ బిల్‌ బరూచ్‌ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అలాగే అమెరికా ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల తీవ్రత కొంత ఉపశమించడం– పసిడి ప్రస్తుతం నెమ్మదించడానికి కారణమని చెప్పారు. అయితే ధర భారీగా పడిపోతే కొనుగోలుకు అది ఒక అవకాశమని కూడా ఆయన సూచించారు. ఆర్‌జేఓ ఫ్యూచర్స్‌ సీనియర్‌ మార్కెట్‌ విశ్లేషకుడు ఫిలిప్‌ మాట్లాడుతూ, ‘పెట్టుబడులు ప్రస్తుతం పసిడిలో ఎందుకు పెట్టాలి? ఈక్విటీల్లో అవకాశాలు బాగున్నాయి కదా? యాపిల్‌ వంటి షేర్లపై ఇన్వెస్టర్లు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు.’’

అని వివరించారు. పారిశ్రామిక వృద్ధి మెరుగుపడుతున్నందున పసిడికన్నా సిల్వర్, ప్లాటినం, పల్లాడియం వంటి మెటల్స్‌ వైపు చూడటం మంచిదని కూడా ఆయన సూచించారు. ఈక్విటీలు, బిట్‌కాయిన్‌లకన్నా, పసిడి ఫండమెంటల్‌గా బలహీనంగా కనిపిస్తోందని డీటీఎన్‌ సీనియర్‌ విశ్లేషకులు డారిన్‌ న్యూసమ్‌ అన్నారు. మొత్తమ్మీద అమెరికా ఆర్థిక పరిస్థితులు, డాలర్, ఈక్విటీ మార్కెట్‌ ధోరణి పసిడి భవితను సమీప భవిష్యత్తులో నిర్దేశించనున్నాయనేది పలువురి విశ్లేషణ.

దేశంలోనూ అంతర్జాతీయ ధోరణే...
3వ తేదీతో ముగిసిన వారంలో అంతర్జాతీయ అంశాలకు అనుగుణంగా దేశంలో పసిడి తగ్గింది. ఫ్యూచర్స్‌ మార్కెట్‌– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలో పసిడి వారం వారీగా రూ.220 తగ్గి రూ. 29,088కు చేరింది. ఇక 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.85 తగ్గి రూ. 29,290కు దిగింది. 99.5 స్వచ్ఛత సైతం ఇదే స్థాయిలో పడిపోయి రూ.29,140కు చేరింది.

ఇక వెండి కేజీ ధర మాత్రం రూ.525 బలపడి రూ.39,385కి చేరింది. కాగా డాలర్‌ అంతర్జాతీయంగా పరుగెత్తినా, దేశీయంగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు, ఈక్విటీ మార్కెట్ల పరుగు నేపథ్యంలో రూపాయి పటిష్ట ధోరణిని ప్రదర్శించడం గమనార్హం. వరుసగా రెండవ వారమూ 14 పైసలు బలపడి (రెండువారాల్లో 50 పైసలు) 64.70 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top