నెట్‌ఫ్లిక్స్‌కూ కోవిడ్‌-19 షాక్‌ | Netflix tumbles in futures due to weakening of new subscribers | Sakshi
Sakshi News home page

నెట్‌ఫ్లిక్స్‌కూ కోవిడ్‌-19 షాక్‌

Jul 17 2020 10:48 AM | Updated on Jul 17 2020 10:52 AM

Netflix tumbles in futures due to weakening of new subscribers - Sakshi

గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2020) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అయితే మూడో త్రైమాసికానికి(జులై- సెప్టెంబర్‌) అంచనాలను కుదించింది. కోవిడ్‌-19 కట్టడికి అమలు చేసిన లాక్‌డవున్‌, ప్రత్యర్ధి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ..  ఇందుకు కారణమయ్యాయి. గురువారం మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెల్లడించడంతో ఫ్యూచర్స్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి నాస్‌డాక్‌ ఫ్యూచర్స్‌లో నెట్‌ఫ్లిక్స్‌ షేరు 9.5 శాతం కుప్పకూలింది. 477 డాలర్లకు చేరింది. దీంతో నేటి(శుక్రవారం) ట్రేడింగ్‌లో ఈ ప్రభావం కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గురువారం ట్రేడింగ్‌లో నెట్‌ఫ్లిక్స్‌ షేరు 0.8 శాతం బలపడి 527 డాలర్లకు ఎగువన ముగిసింది.

క్యూ2 రికార్డ్
లాక్‌డవున్‌ల కారణంగా ఈ ఏడాది క్యూ2(ఏప్రిల్‌- జూన్‌)లో నెట్‌ఫ్లిక్స్‌ ఏకంగా 10 మిలియన్‌ కొత్త కస్టమర్లను పొందింది. దీంతో కొత్త కస్టమర్ల సంఖ్య 26 మిలియన్లకు చేరింది. అయితే క్యూ3లో కొత్త పెయిడ్‌ కస్టమర్ల సంఖ్య 2.5 మిలియన్లకు తగ్గనున్నట్లు అంచనా వేసింది. స్ట్రీమింగ్‌ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 5.3 మిలియన్‌ కొత్త కస్టమర్లు జతకాగలరని విశ్లేషకులు అంచనా వేశారు.  అమెజాన్‌ ప్రైమ్‌తోపాటు ఇటీవల డిస్నీప్లస్‌ రేసులోకి రావడంతో పోటీ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంతో పోలిస్తే ద్వితీయార్ధంలో పనితీరు మందగించనున్నట్లు నెట్‌ప్లిక్స్‌ అభిప్రాయపడింది.

ఆదాయం అప్‌
క్యూ2లో నెట్‌ఫ్లిక్స్‌ ఆదాయం 25 శాతం పెరిగి 6.15 బిలియన్‌ డాలర్లను తాకగా.. నికర లాభం రెండు రెట్లు ఎగసి 72 కోట్ల డాలర్లకు చేరింది. క్యూ3లో 6.33 బిలియన్‌ డాలర్ల ఆదాయం, 95.4 కోట్ల డాలర్ల నికర లాభాన్ని నెట్‌ఫ్లిక్స్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కంటెంట్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్న టెడ్‌  శరండోస్‌ను కో-సీఈవోగా ప్రమోట్‌ చేస్తున్నట్లు నెట్‌ప్లిక్స్‌ తాజాగా పేర్కొంది. తద్వారా కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో రీడ్‌ హ్యాస్టింగ్‌కు కార్యకలాపాల నిర్వహణలో మరింత సహకారాన్ని అందించనున్నట్లు తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement