నెంబర్‌ 2@ 2030

ndia could be second-largest economy by 2030, says PM Narendra Modi - Sakshi

అత్యంత వేగంగా భారత్‌ వృద్ధి

ప్రధాని నరేంద్రమోదీ విశ్వాసం

2019 పెట్రోటెక్‌ సదస్సు ప్రారంభం  

గ్రేటర్‌ నోయిడా: భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. 2030 నాటికి దేశం ప్రపంచంలోనే రెండవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) సంస్థ, ప్రపంచబ్యాంక్‌ వంటి దిగ్గజాలు భారత్‌ వృద్ధి వేగం కొనసాగుతుందని పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులనూ దేశం తట్టుకుని తగిన వృద్ధి రేటును సాధిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిగా ఉంది’’ అని ప్రధాని అన్నారు. సోమవారం నుంచీ మూడు రోజుల పాటు ఇక్కడ జరగనున్న అంతర్జాతీయ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సదస్సు– పెట్రోటెక్‌ 2019ను ప్రధాని ప్రారంభించారు.  భాగస్వామ్య దేశాల నుంచి 95 మందికి పైగా ఇంధన శాఖ మంత్రులు, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన 7,000 మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సును ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రారంభోపన్యాసంలో  కొన్ని ముఖ్యాంశాలు... 

∙భారత్‌ వేగంగా వృద్ధి చెందుతోంది.ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. ఇటీవల వెలువడిన ఒక నివేదిక ప్రకారం– 2030 నాటికి భారత్‌ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనుంది.  

∙ఇటీవల క్రూడ్‌ ధరల తీవ్ర ఒడిదుడుకుల పరిస్థితిని చూస్తున్నాం. అటు వినియోగదారులు, ఇటు ఉత్పత్తిదారులు ఇరువురి ప్రయోజనాలకు తగిన సమతౌల్య ధరల విధానం ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే చమురు, గ్యాస్‌ ధరలు పారదర్శకంగా, తగిన స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడే సమాజం ఇంధన అవసరాలను మనం నెరవేర్చగలుగుతాం.  

∙పారిస్‌ వాతావరణ సదస్సు–2015 లక్ష్యాలను సాధించే దిశలో కూడా భారత్‌ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.  

∙ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీ (ముడి చమురు శుద్ధి)సామర్థ్యాన్ని సముపార్జించుకుంది.  ప్రస్తుతం 230 ఎంఎంటీపీఏ (వార్షికంగా... మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు)గా ఉన్న సామర్థ్యం 2030 నాటికి మరో 200 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.  

∙బయో ఫ్యూయెల్‌ విధానాన్ని గత ఏడాది రూపొందించాం. పటిష్ట ఇంధన ప్రణాళికలను రూపొందించి అవలంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సమగ్ర, పటిష్ట ఇంధన విధానం అవలంభించడం దేశానికి ప్రస్తుతం ఎంతో అవసరం. గ్రామాలకు ఇప్పటికే విద్యుత్‌ సదుపాయాలను పూర్తిగా విస్తరించడం జరిగింది. ఇక గృహాలకు 100 శాతం విద్యుత్‌ ఈ ఏడాది దేశం లక్ష్యం. ఇదే సమయంలో విద్యుత్‌ ఆదాకు తగిన ప్రణాళిననూ దేశం అనుసరిస్తోంది.  

∙పొగ సంబంధ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా క్లీన్‌ కుకింగ్‌ ఫ్యూయెల్‌ను అందుబాటులోనికి తీసుకురావడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోంది. 6.4 కోట్ల కుటుంబాలకు ఇప్పటికే ఎల్‌పీజీ సౌలభ్యతను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.  

పెట్టుబడులకు యూఏఈ ఆసక్తి 
రిఫైనింగ్, పెట్రోకెమికల్‌ ప్రాజెక్టులు, క్రూడ్‌ నిల్వల వంటి రంగాల్లో భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ) ఆసక్తితో ఉందని యూఏఈ మంత్రి, ఏడీఎన్‌ఓసీ (అబూ ధబీ నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ) సీఈఓ సుల్తాన్‌ అహ్మద్‌ అల్‌ జబీర్‌ పేర్కొన్నారు.  మహారాష్ట్రలోని రత్నగిరిలో ప్రతిపాదిత 44 బిలియన్‌ డాలర్ల రిఫైనరీ కమ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌లో ఏడీఎన్‌ఓసీ, దాని భాగస్వామి సౌదీ ఆరామ్‌కోలు సంయుక్తంగా 50 శాతం వాటా తీసుకున్న సంగతి తెలిసిందే. మరిన్ని పెట్టుబడులకు తాము ఆసక్తిగా ఉన్నట్లు అహ్మద్‌ అల్‌ జబీర్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం 6వ స్థానం... 
2013–14లో ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిఉన్న భారత్‌ తాజాగా ఆరవ స్థానానికి ఎదిగింది. ఐదవ స్థానంలో ఉన్న బ్రిటన్‌ను సైతం త్వరలో అధిగమిస్తుందని కొందరి విశ్లేషణ.  ప్రస్తుతం 19.39 లక్షల కోట్ల డాలర్ల పరిమాణంతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా (12.23 లక్షల కోట్ల డాలర్లు), జపాన్‌ (4.87 లక్షల కోట్ల డాలర్లు) జర్మనీ (3.67 లక్షల కోట్ల డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బ్రిటన్‌ జీడీపీ 2.62 లక్షల కోట్ల డాలర్లుకాగా, భారత్‌ జీడీపీ విలువ 2.59 లక్షల డాలర్లు. కాగా ఫ్రాన్స్‌ జీడీపీ 2.58 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. ఇటీవల స్టాండెర్డ్‌ చార్టర్డ్‌ ఒక నివేదిక విడుదల చేస్తూ, 2030 నాటికి చైనా అమెరికా స్థానాన్ని ఆక్రమిస్తుందని, చైనా స్థానానంలో భారత్‌ ఉంటుందని పేర్కొంది. అమెరికా మూడవ స్థానానికి పడుతుందని విశ్లేషించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top