భారత కుబేరుల్లో తెలుగు వెలుగులు

భారత కుబేరుల్లో   తెలుగు వెలుగులు


 సింగపూర్: ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ రూపొందించిన టాప్-100 భారత అపర కుబేరుల జాబితాలో తెలుగువాళ్లు ఐదుగురు స్థానం దక్కించుకున్నారు. వీరిలో నలుగురు ఫార్మా రంగానికి చెందిన వారే కావడం విశేషం. డాక్టర్ రెడ్డీస్‌కు చెందిన సతీష్ రెడ్డి, జి.వి. ప్రసాద్‌లు కలిసి 220 కోట్ల డాలర్ల సంపదతో 41వ స్థానంలో నిలిచారు.



 ఇక దివీస్ ల్యాబ్స్‌కు చెందిన దివి మురళి 200 కోట్ల డాలర్ల సంపదతో 45వ స్థానాన్ని సాధించారు. అరబిందో ఫార్మాకు చెందిన పి.వి.రామ్‌ప్రసాద్ రెడ్డికి 54వ స్థానం(180 కోట్ల డాలర్లు) దక్కింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈయన మళ్లీ ఈ జాబితాలో చోటు సాధించారు. ఇక జీఎంఆర్ గ్రూప్‌కు చెందిన జి.ఎం.రావు 100 కోట్ల డాలర్లతో 98వ స్థానంలో నిలిచారు.

 

టాప్‌లో మళ్లీ ముకేశ్

 అత్యంత సంపన్నుడైన భారతీయుడిగా మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ ఆంబానీకే కిరీటం దక్కింది. ఫోర్స్బ్ లిస్టులో  2,360 కోట్ల డాలర్ల(దాదాపు రూ.1.41 లక్షల కోట్లు) సంపదతో ముకేశ్ టాప్‌లో నిలిచారు. అగ్రస్థానాన్ని సాధించడం ముకేశ్‌కి వరుసగా ఎనిమిదోసారి. మోదీ అధికారంలోకి రావడంతో స్టాక్ మార్కెట్ల జోరు(జనవరి నుంచి 28% అప్) కారణంగా  కుబేరుల సంపద భారీగా ఎగసిందని ఫోర్బ్స్ పేర్కొంది.



 కాగా, రెండో స్థానంలోకి సన్ ఫార్మా దిలిప్ సంఘ్వి(సంపద 1,800 కోట్ల డాలర్లు) దూసుకొచ్చారు. మూడో స్థానంలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ(సంపద 1,640 కోట్ల డాలర్లు) ఉన్నారు.  టాప్-100 లో నలుగురు మహిళలకే స్థానం దక్కింది. 640 కోట్ల డాలర్ల సంపదతో జిందాల్ గ్రూప్ అధినేత్రి సావిత్రీ జిందాల్ 12వ స్థానంలో నిలిచారు. మిగతా వారిలో ఇందూజైన్(31), కిరణ్ మజుందార్ షా(81), అను అఘా(94) ఉన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top