ఐటీ కాంగ్రెస్‌కు మోదీ, సోఫియా!

Modi, Sophia to IT Congress - Sakshi

ఫిబ్రవరి 19–21 తేదీల్లో డబ్ల్యూఐటీసీ

ఇదే వేదికగా నాస్కామ్‌ ఇండియా లీడర్‌షిప్‌ ఫోరం కూడా..

30 దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్‌ మరోసారి వేదిక కానుంది. ఫిబ్రవరి 19–21 తేదీల్లో మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో 22వ వరల్డ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌ (డబ్ల్యూఐటీసీ) సదస్సు జరగనుంది. ఇండియాలో తొలిసారిగా అది కూడా హైదరాబాద్‌లో నిర్వహించటం ప్రత్యేకత.

డబ్ల్యూఐటీసీతో అనుసంధానంగా ఇదే వేదికగా నాస్కామ్‌ ఇండియా లీడర్‌షిప్‌ ఫోరం (ఎన్‌ఐఎల్‌ఎఫ్‌) కూడా జరగనుంది. 25 ఏళ్లుగా ప్రతి ఏటా ముంబైలో నిర్వహించే ఈ ఎన్‌ఐఎల్‌ఎఫ్‌ తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. గురువారమిక్కడ మంత్రి కేటీ రామారావుతో కలిసి రెండు సదస్సుల వివరాలను విలేకరులకు తెలిపారు.

నరేంద్ర మోదీ, సోఫియా హాజరు..
ఏడాదిన్నర క్రితం నుంచే డబ్యూఐటీసీ సదస్సు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 3 రోజుల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముందని.. రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్‌ తరఫున ప్రధాని కార్యాలయానికి ఆహ్వాన పత్రిక పంపించామని, అయితే పీఎంఓ ఇంకా ధ్రువీకరించలేదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సౌదీ అరేబియా పౌరసత్వాన్ని పొందిన కృత్రిమ మేధ ఆధారిత రోబో సోఫియా కూడా హాజరవుతుందని చంద్రశేఖర్‌ తెలిపారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన హన్సన్‌ రోబోటిక్స్‌ ఈ రోబోను అభివృద్ధి చేసింది.

30 దేశాలు; 2,500 ప్రతినిధులు..
డబ్యూఐటీసీకి 30 దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరవుతారని, ఇందులో 500 మంది విదేశీ ప్రతినిధులుంటారని చంద్రశేఖర్‌ తెలిపారు. కెనడా, అమెరికా, తైవాన్, అర్మేనియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ వంటి దేశాల్లోని ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధుల హాజరు ఖరారైందన్నారు. హనీవెల్‌ టెక్నాలజీస్, ఎన్‌ఈసీ, హన్సన్‌ రోబోటిక్స్, నోవార్టిస్, ఫెడెక్స్, అడోబ్, పిరమల్‌ గ్రూప్‌ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. వీరితో పాటూ ప్రపంచ దేశాల్లోని ఐటీ లీడర్లు, విశ్లేషకులు, పెట్టుబడిదారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు.

2019లో అర్మేనియాలో..
1978 నుంచీ ప్రతి రెండేళ్లకోసారి వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ జరుగుతోంది. గత ఏడాది పలు దేశాలు నిర్వహణ కోసం పోటీ పడటంతో... ప్రతి ఏటా నిర్వహించాలని నిర్ణయించారు. 2017లో తైవాన్‌లో జరగ్గా... ఈ ఏడాది హైదరాబాద్‌ వేదికకానుంది. 2019లో అర్మేనియా, 2020లో మలేషియా, 2021లో బంగ్లాదేశ్‌లో జరగనున్నట్లు వరల్డ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ అలయెన్స్‌ (డబ్ల్యూఐటీఎస్‌ఏ) చైర్మన్‌ వ్యోనీ చీ తెలిపారు.

డబ్ల్యూఐటీఎస్‌లో పెట్టుబడుల ప్రకటన..
డబ్ల్యూఐటీఎస్‌ వేదికగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ రంగాల్లో పలు కంపెనీలు తమ పెట్టుబడుల ప్రణాళికల్ని ప్రకటించే అవకాశమున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ఏఐ, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, ప్రపంచీకరణ, ఐఓటీ, సైబర్‌ సెక్యూరిటీ, క్రీడలు–సాంకేతికత, డిజిటల్‌ రెవెల్యూషన్స్‌ వంటి ప్రధాన విభాగాల్లో ప్రపంచ దేశాల్లోని నిపుణులు, విశ్లేషకులు 22 సెషన్స్‌లో బృంద చర్చలుంటాయని చంద్రశేఖర్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, హైదరాబాద్‌ భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చిస్తారు. మన దేశం నుంచి 60 ఇన్నోవేషన్‌ కంపెనీలు పాల్గొంటాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top