త్వరలో మారుతీ సూపర్ క్యారీ! | Maruti Suzuki starts export of LCV Super Carry | Sakshi
Sakshi News home page

త్వరలో మారుతీ సూపర్ క్యారీ!

Jun 22 2016 12:11 AM | Updated on Sep 4 2017 3:02 AM

త్వరలో మారుతీ సూపర్ క్యారీ!

త్వరలో మారుతీ సూపర్ క్యారీ!

వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి భారత లైట్ కమర్షియల్ వెహికిల్స్ (ఎల్‌సీవీ) విభాగంలోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంది.

మూడు నెలల్లో భారత మార్కెట్లోకి
కంపెనీ నుంచి తొలి ఎల్‌సీవీ ఇదే
తీవ్రతరం కానున్న పోటీ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి భారత లైట్ కమర్షియల్ వెహికిల్స్ (ఎల్‌సీవీ) విభాగంలోకి ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకోసం ‘సూపర్ క్యారీ’ మోడల్‌ను మూడునెలల్లో దేశీ మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్, సేల్స్ ఈడీ ఆర్.ఎస్.కల్సి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. గుర్గావ్ ప్లాంటులో ఈ వాహనాలను తయారు చేస్తున్నారు.

ప్రస్తుతం ద క్షిణాఫ్రికా, టాంజానియాకు కంపెనీ ఈ వాహనాలను ఎగుమతి చేయటం ఆరంభించింది. జూన్‌లో మొదటి లాట్ కింద 100 వాహనాలను సరఫరా చేశారు. సార్క్ దేశాలకూ గుర్గావ్ ప్లాంటు నుంచి ఎగుమతి చేయనున్నారు. ప్లాంటు వార్షిక సామర్థ్యం 80,000 యూనిట్లు. జపాన్ ఆటో దిగ్గజం సుజుకి... 1961లో సుజులైట్ క్యారీ పేరుతో తొలి ఎల్‌సీవీని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ మోడల్ తాలూకు 11వ తరం అంతర్జాతీయంగా అందుబాటులో ఉంది.

 మార్కెట్‌కు ఊపు...
భారత ప్యాసింజర్ వాహన విపణిలో మొదటి స్థానంలో ఉన్న మారుతి సుజుకి వాటా మే నెలలో ఏకంగా 48.5 శాతానికి ఎగసింది. పరిశ్రమ 7 శాతం వృద్ధి నమోదు చేస్తే, కంపెనీ 13 శాతం వృద్ధి కనబరిచింది. ఈ స్థాయిలో దూసుకెళ్తున్న మారుతి... ఎల్‌సీవీ విభాగంలోనూ తన ముద్ర వేయటానికి ప్రయత్నిస్తోంది. అందుబాటు ధర, మన్నిక, సర్వీసు... వంటి అంశాలే కలిసొస్తాయని కంపెనీ భావిస్తోంది. మార్కెట్ తీరుకు అనుగుణంగా రాష్ట్రాల వారీగా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. సూపర్ క్యారీ అమ్మకాల కోసం ప్రత్యేక షోరూంలను కంపెనీ నెలకొల్పనుండగా... తాము దీనికి సిద్ధంగా ఉన్నట్లు వరుణ్ మోటార్స్ ఎండీ వి.వరుణ్ దేవ్ తెలిపారు.

 ఇదీ ఎల్‌సీవీ పరిశ్రమ..
చిన్న వాణిజ్య వాహనాల (ఎల్‌సీవీ) పరిశ్రమ దేశంలో 2013-14లో 17 శాతం, 2014-15లో 11 శాతం తిరోగమన వృద్ధి నమోదు చేసింది. కంపెనీలకు కాస్త ఊపిరినిస్తూ 2015-16లో 0.30 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 3,83,331 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ గాడిలో పడుతుందని సియామ్ అంచనా వేస్తోంది. ఈ సెగ్మెంట్లో... మారుతి రాకతో పోటీ పెరగనుంది.

 సూపర్ క్యారీ ప్రత్యేకతలు..
సూపర్ క్యారీ ఇంజన్ సామర్థ్యం 800 సీసీ. డీజిల్, సీఎన్‌జీ వెర్షన్లలో లభ్యమవుతుంది. 750 కిలోల బరువు మోయగలదు. 3.8 మీటర్ల పొడవు, 1.56 మీటర్ల వెడల్పు, లోడ్ డెక్ 2.18/1.49 మీటర్లు, 175 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, అయిదు గేర్లు, రెండు సీట్లతో క్యాబిన్, ఇండిపెండెంట్ ఫ్రంట్ సస్పెన్షన్ దీని ఫీచర్లు. వాహనం ఎక్స్ షోరూం ధర రూ.4 లక్షలు ఉండొచ్చని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement