బిట్‌కాయిన్‌ ముందు దిగదుడుపే!

Looking Heavy? Bitcoin Eyes Correction After New High - Sakshi

న్యూజిలాండ్, కువైట్‌ జీడీపీల కంటే పెద్దది

దిగ్గజ బ్యాంకుల కంటే అధిక విలువ

ప్రపంచ కుబేరులూ దీని వెనుకే

అంతకంతకూ పెరిగిపోతున్న క్రిప్టోకరెన్సీ  

న్యూఢిల్లీ: ఈ ఏడాది బిట్‌కాయిన్‌ విరామం ఎరుగకుండా పరుగులు తీస్తుండడంతో దీని మార్కెట్‌ విలువ భారీ స్థాయికి చేరింది. దేశీ ఆర్థిక వ్యవస్థలను మించిపోతోంది. సోమవారం ట్రేడింగ్‌లో బిట్‌ కాయిన్‌ విలువ 11,000 డాలర్లు దాటేసి ఇంకా ముందుకెళ్లింది. ఈ ఏడాది దీని పెరుగుదల ఇప్పటికే 1000 శాతాన్ని మించిపోయింది. మార్కెట్‌ విశ్లేషకుల అంచనా ప్రకారం ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్ని బిట్‌ కాయిన్ల విలువ (మార్కెట్‌ క్యాప్‌) 190 బిలియన్‌ డాలర్లు. ఇప్పటికే ఇది పలు రికార్డులను తిరగరాసేసింది.

న్యూజిలాండ్‌ జీడీపీ కన్నా ఎక్కువే...
దక్షిణ పసిఫిక్‌ దేశం వ్యవసాయం, పర్యాటక రంగాలపై ఆధారపడిన న్యూజిలాండ్‌ జీడీపీ విలువ 185 బిలియన్‌ డాలర్లు. ఈ దేశ జీడీపీ కంటే బిట్‌కాయిన్‌ మార్కెట్‌ విలువ 5 బిలియన్‌ డాలర్లు ఎక్కువ. అలా గే, ఖతర్, కువైట్, హంగరీ దేశాలూ జీడీపీ విలువ విషయంలో బిట్‌కాయిన్‌ కంటే వెనక్కు వచ్చేశాయి.

గోల్డ్‌మ్యాన్‌ శాక్స్, యూబీఎస్‌..
ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన బ్యాంకులు గోల్డ్‌మ్యాన్‌ శాక్స్, యూబీఎస్‌ల కంటే బిట్‌కాయిన్‌ విలువే ఎక్కువ. గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ గ్రూపు మార్కెట్‌ విలువ 97 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, యూబీఎస్‌ గ్రూపు ఏజీ మార్కెట్‌ విలువ 67 బిలియన్‌ డాలర్లు. ఈ రెండు బ్యాంకుల మార్కెట్‌ విలువ కలిపి చూసినా బిట్‌కాయిన్‌ కంటే తక్కువే. ఈ డిజిటల్‌ కరెన్సీ విషయంలో ఆర్థిక సంస్థలు ఒకింత అప్రమత్తంగానే ఉన్నాయి. బిట్‌కాయిన్‌ వ్యూహాన్ని రూపొందించడం చాలా తొందరపాటు అవుతుందని గోల్డ్‌మ్యాన్‌ సీఈవో లైడ్‌ బ్లాంక్‌ఫీన్‌ పేర్కొనగా... ప్రభుత్వాలు నిషేధించే అవకాశాలు లేవని చెప్పలేం కనక బిట్‌కాయిన్‌ను తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోలేమని యూబీఎస్‌ తెలిపింది.

బోయింగ్‌ కన్నా ఇదే అధికం!
ప్రముఖ విమాన తయారీ కంపెనీ బోయింగ్‌ సైతం బిట్‌కాయిన్‌ ముందు చిన్నబోవాల్సిందే. బోయింగ్‌ కంపెనీ మార్కెట్‌ విలువ 162 బిలియన్‌ డాలర్లు. కానీ, నిన్నగాక మొన్నొచ్చిన బిట్‌కాయిన్‌ ఇన్వెస్టర్లకు విలువైనదిగా మారిపోయింది. చికాగోకు చెందిన బోయింగ్‌ సంస్థ, వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిరోస్పేస్‌ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 1,40,000 మందికి ఈ సంస్థ ఉపాధి కల్పిస్తోంది. మరో విమానయాన సంస్థ ఎయిర్‌బస్‌ ఎస్‌ఈ మార్కెట్‌ విలువ సైతం 78 బిలియన్‌ డాలర్లుగానే ఉంది.

మరికొన్ని చిత్రాలివీ...
అమెరికా నౌకదళానికి ఈ ఏడాది మే నెలలో అందుబాటులోకి వచ్చిన అణుశక్తి ఆధారిత సూపర్‌ క్యారియర్‌ (నౌక) గెరాల్డ్‌ ఆర్‌.ఫోర్డ్‌ ఒక్కో దాని ఖరీదు 13 బిలియన్‌ డాలర్లు. ఈ రకంగా చూస్తే బిట్‌కాయిన్‌ మార్కెట్‌ విలువతో 14 యుద్ధనౌకలను సమకూర్చుకోవచ్చు.
 ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో బిల్‌గేట్స్, వారెన్‌ బఫెట్‌ తప్పకుండా ఉంటారు. వీరు జీవిత కాలం సంపాదించిన మొత్తం కూడా బిట్‌కాయిన్‌లో సగమే. గేట్స్‌ సంపద విలువ 90 బిలియన్‌ డాలర్లు కాగా, బఫెట్‌ సంపద విలువ 83 బిలియన్‌ డాలర్లు. వీరిద్దరి సంపద కలిపినా బిట్‌కాయిన్‌తో సరితూగలేదు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top