ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఫైనాన్షియల్ గురూ రాబర్ట్ కియోసాకి ఇటీవల తన దగ్గరున్న 2.25 మిలియన్ డాలర్ల (సుమారు రూ.20 కోట్లు) విలువైన బిట్‌కాయిన్‌లను ఒక్కోటి సుమారు 90 వేల డాలర్ల (సుమారు రూ.80 లక్షలు) ధర వద్ద విక్రయించినట్లు వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం ఒక్కో బిట్‌కాయిన్‌ను 6 వేల డాలర్లకు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
క్రిప్టో మార్కెట్ గట్టి సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో, బిట్‌కాయిన్ (Bitcoin) తిమింగలం ఓవెన్ గుండెన్ 1.3 బిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్‌లను అమ్మేసినట్లు చెబుతున్న క్రమంలోనే రాబర్ట్ కియోసాకి నుంచి కూడా ఈ ప్రకటన రావడం గమనార్హం. బిట్‌కాయిన్‌లపై బుల్లిష్‌గా ఉండే కియోసాకి కూడా ఆఫ్‌లోడింగ్‌కు వెళ్లడం క్రిప్టో ఇన్వెస్టర్లను షాక్‌కు గురి చేస్తోంది.
రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ‘ఎక్స్’ పోస్టులో ఈ విక్రయం తన “లాభాలను స్థిరమైన, నగదు ప్రవాహం ఇచ్చే ఆస్తుల్లోకి మార్చే” దీర్ఘకాల వ్యూహాన్ని అనుసరించిందని చెప్పారు. బిట్‌కాయిన్ల విక్రయం ద్వారా వచ్చిన నగదుతో రెండు సర్జరీ సెంటర్లు, బిల్‌బోర్డ్ వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. ఈ పెట్టుబడులు వచ్చే ఫిబ్రవరి నాటికి నెలకు సుమారు 27,500 డాలర్ల పన్ను రహిత నగదు ప్రవాహం ఇవ్వగలవని ఆయన అంచనా.
ఈ కొత్త పెట్టుబడులు, ఇప్పటికే తన వద్ద ఉన్న నగదు ప్రవాహం కలిగించే రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తాయని, తద్వారా తన మొత్తం నెలవారీ ఆదాయం “వందల వేల డాలర్లకు” చేరుతుందని కియోసాకి చెప్పారు.
బిట్‌కాయిన్‌లను అమ్మేసినప్పటికీ, దాని భవిష్యత్తుపై విశ్వాసం కోల్పోలేదని, ఈ కొత్త పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయంతో మరిన్ని బిట్‌కాయిన్లను తిరిగి కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది బిట్‌కాయిన్‌ను విడిచిపెట్టడం కాదని, లాభాలను పన్ను ప్రయోజనాలు ఇచ్చే, పునరావృత ఆదాయం సృష్టించే ఆస్తుల్లోకి మార్చే తన దీర్ఘకాల తత్వం అమలులో భాగమని పేర్కొన్నారు.
భద్రతా కారణాల వల్ల ఈ అమ్మకాన్ని బహిరంగంగా ప్రకటించవద్దని తనకు ఆప్తులు సలహా ఇచ్చినప్పటికీ, “నకిలీ డబ్బు, నకిలీ గురువుల ప్రపంచంలో, నేను బోధించేదాన్ని నేనూ అనుసరిస్తానని చూపడం ముఖ్యం” అని కియోసాకి రాసుకొచ్చారు. చివరగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గందరగోళ దిశగా కదులుతోందని హెచ్చరిస్తూ, అందరూ తమ సొంత సంపద పెంపు వ్యూహాల గురించి ఆలోచించాల్సిన సమయం ఇదేననంటూ పిలుపునిచ్చారు.
PRACTICING WHAT I TEACH:
I sold $2.25 million in Bitcoin for approximately $90,000.
I purchased the Bitcoin for $6,000
a coin years ago.
With the cash from Bitcoin I am purchasing two surgery centers and investing in a Bill Board business.
I estimate my $2.25 million…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 21, 2025


